
వేసవిలో ఎమ్మిగనూరు ‘పులి’కింత
● నీటి ఎద్దడిని నివారిస్తున్న
పులికనుమ రిజర్వాయర్
● ఈ నెల 21 తరువాత నుంచి
పట్టణానికి నీటి సరఫరా
● వైఎస్సార్ చలువతో
‘పులికనుమ’ నిర్మాణం
ఎమ్మిగనూరు టౌన్: వేసవిలో ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహాన్ని పులికనుమ రిజర్వాయర్ నీరు తీర్చనుంది. ఇందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈనెల 21 నుంచి ‘పులికనుమ’ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఆ నీటిని ఎస్‌ఎస్ ట్యాంక్‌లో నింపితే మళ్లీ వర్షాలు పడే వరకు నీటి ఎద్దడి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఎమ్మిగనూరు పట్టణంలో లక్షకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి దాహార్తిని తీర్చేందుకు గుడికల్ చెరువులో 526 మిలియన్ లీటర్ల నీటిని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లో 87 మిలియన్ లీటర్ల నీటిని అధికారులు నిల్వ చేశారు. వీటి ద్వారా పట్టణంలో ఉన్న 4 ట్యాంక్‌లతో 13 వేల కుళాయిలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నీటి సమస్య ఉత్పనం అయ్యే సూచనలు కనిపించాయి. దీంతో పులికనుమ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచిన నీటిని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లించి ఎస్‌ఎస్ ట్యాంక్‌ను నింపేందుకు అఽధికారులు చర్యలు చేపట్టారు. పులికనుమ రిజర్వాయర్‌ను మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డీఈ నీరజ, ఏఈ శరత్‌కుమార్ తదితరులు సందర్శించారు. నీటి విడుదలపై చర్చించారు.
వైఎస్సార్ చలువ..
గతంలో ఎల్లెల్సీ ద్వారా నీటి సరఫరా నిలిచిపోతే ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడేది. ట్యాంక్‌లకు నీటి సరఫరా లేక గుక్కెడు నీటికోసం పట్టణ వాసులు ఇబ్బంది పడేవారు. అప్పట్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పులికనుమ రిజర్వాయర్ నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడం, నిధులను విడుదల కావడంతో నిర్మాణం పూర్తయ్యింది.
ఇలా ఉపయోగం..
తాగు, సాగునీటి అవసరాలకు పులికనుమ రిజర్వాయర్ ఉపయోగపడుతోంది. ఏటా వేసవికి ముందు పులికనుమ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేస్తారు. వేసవిలో పులికనుమ నీటిని ఎల్లెల్సీ ద్వారా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుకు తరలిస్తారు. ఆ నీటిని ఎమ్మిగనూరు పట్టణ వాసులకు అందిస్తారు. ముందు చూపుతో నిర్మించిన పులికనుమ రిజర్వాయర్ పట్టణ వాసులకు అత్యవసర సమయంలో ఆదుకుంటూ నీటి ఎద్దడి రాకుండా ఉపయోగపడుతోంది. దీంతో పట్టణ వాసులు మహానేత వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన మేలును మరువలేకపోతున్నారు.
నీటి సమస్య ఉండదు
ఎమ్మిగనూరు పట్టణానికి వేసవిలో ఎలాంటి నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుల్లో ఉన్న నీరు నెలాఖరు వరకు ఉపయోగడుతుంది. పులికనుమ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడాను. వారు సానుకూలంగా స్పందించారు. మరో 45 రోజుల పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తదు.
– గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్

వేసవిలో ఎమ్మిగనూరు ‘పులి’కింత