
ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని, 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు 10వ తరగతి పాసైన యువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువకులు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరాబ్యాంకు–గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(డీఆర్‌డీఏ–టీటీడీసీ ప్రక్కన)లో సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 63044 91236 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ఆత్మకూరురూరల్: వెంకటాపురం గ్రామంలో శనివారం ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన కుందూరు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ఏకై క కుమారుడు కుందూరు చరణ్ రెడ్డి(15) తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో ఊరు శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈత అంతగా రాని చరణ్ రెడ్డి బావిలో దూకడంతో నేరుగా నీటిలో మునిగి బురదలో చిక్కుకున్నాడు. దీంతో ఊపిరాడక మరణించాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చరణ్ మృతదేహాన్ని వెళికి తీశారు. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు.