
వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు
కల్లూరు: సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన సీపీఐ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప నేతృత్వంలో శ్రీనివాసరావు, మహేష్, బాబయ్య, అశోక్, రాముడు, అలాగే నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జే.లక్ష్మీనరసింహ, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జిలానీ బాషా చేరుకున్నారు. వీరిని పోలీసులు అత్యు త్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు సీఎంను కలిసే ఏర్పాటు చేస్తామని చెప్పి ఉలిందకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ అరెస్టును సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఖండించారు.