సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ | - | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌

May 16 2025 12:52 AM | Updated on May 16 2025 1:23 AM

సప్లిమెంటరీ పరీక్షల్లో  మాల్‌ ప్రాక్టీస్‌

సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌

ఒక కేసు నమోదు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో గురువారం ఓ మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్య శెట్టి తెలిపారు. ఉదయం జరిగిన ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో 9,380 మంది విద్యార్థులకుగాను 8,963 మంది హాజరై 417 మంది గైర్హాజరయ్యారన్నారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ వొకేషనల్‌ కాలేజీలో ఓ విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించిన తనిఖీ అధికారులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్‌ పరీక్షలకు 1,277 మందికిగాను 1,203 మంది హాజరై 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

17న కర్నూలుకు

సీఎం చంద్రబాబు

కర్నూలు(సెంట్రల్‌): సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన ఖరారైంది. కర్నూలు రైతు బజార్‌లో జరిగే స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదికలో పీ4 లబ్ధిదారులు, మార్గదర్శకులతో మాట్లాడేందుకు వీలుగా పర్యటనను ఖరారు చేశారు. 17న ఉదయం 11.25 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు రోడ్డు మార్గంలో కర్నూలు సీక్యాంపు రైతు బజార్‌ను చేరుకొని 12.25 గంటల వరకు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శానిటరీ వర్కుర్లు, రైతులతో మాట్లాడుతారు. 12.35 గంటలకు కేంద్రీయ విద్యాలయం పక్కన ఏర్పాటు చేసే కార్యక్రమంలో స్వచ్ఛంధ్రా –స్వర్ణాంధ్ర పార్కు, 100 అడుగుల రోడ్డుకు భూమి పూజ చేస్తారు. 2 నుంచి 3.30 గంటల వరకు కర్నూలు ప్రజలతో సంభాషిస్తారు. 3.35 నుంచి 5.05 గంటల వరకు క్యాడర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

ఏపీ ఈసెట్‌లో

జిల్లా విద్యార్థుల ప్రతిభ

కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్‌ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్‌టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్‌ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్‌ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్‌ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్‌కి చెందిన పెరుమళ్ల రాజేష్‌ 6వ ర్యాంకు, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్‌ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్‌ ముబారక్‌ నగర్‌కి చెందిన షేక్‌ ముస్కాన్‌ 6వ ర్యాంకు, షేక్‌ తజ్మీన్‌ 10వ ర్యాంకు సాధించారు.

‘సిల్వర్‌జూబ్లీ’లో

వందశాతం ఫలితాలు

కర్నూలు సిటీ: క్లస్టర్‌ యూనివర్సిటీ సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 6వ సెమిస్టర్‌ ఫలితాలను గురువారం ఆ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మొత్తం 216 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా 216 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారని పరీక్షల విభాగం డీన్‌ డాక్టర్‌ కె నాగరాజు శెట్టి తెలిపారు. ఆ తరువాత రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. సిల్వర్‌ జూబ్లీ కాలేజీ అంటే ఓ బ్రాండ్‌ అని, ఇక్కడ చదివిన వారందరు గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. సిల్వర్‌జూబ్లీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. శ్రీనివాస్‌, కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ బాల కృష్ణయ్య శెట్టి, డాక్టర్‌ పి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement