
అనుమానంతో చంపేశాడు!
బేతంచెర్ల: ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కడతేర్చాడు. భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యాడు. ఈ ఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక గౌరిపేట కాలనీకి చెందిన షేక్ రసూల్‌తో నంద్యాల పట్టణానికి చెందిన జకియా బేగం(37)కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ రసూల్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. సవ్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో గత కొన్ని రోజులుగా భార్యను అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవ పడి కోపంతో భార్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. జకియా బేగం కుటుంబీకులకు ఆత్మహత్య చేసుకుందని రసూల్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కాగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లభించకపోవడంతో అందరూ నిలదీయడంతో పరారయ్యాడు. మృతురాలి తమ్ముడు సయ్యద్ అజ్మతుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.