
చంపడాలు, చావడాలు ఎవరికీ మంచివి కావు
చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చే సమయంలో అడ్డుపడిన బోయ సాంబశివుడును సైతం దారుణంగా మట్టుబెట్టారు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు సంతానం. నారాయణరెడ్డి కుటుంబీకుల ఆశీస్సులతో సాంబశివుడి తల్లి బోయ రాములమ్మ ప్రస్తుతం చెరుకులపాడు గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. ఆయన తండ్రి జయరాముడు కాలం చేయడంతో.. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు గంగాధర్, మురళీకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ‘సాక్షి’ వాళ్లను పలుకరించగా.. ‘సాంబశివుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. మేము అష్టకష్టాలతో నారాయణరెడ్డి కుటుంబం చలువతో జీవనం నెట్టుకొస్తున్నాం. చంపడాలు, చావడాలు, జైలుకు పోవడాలు ఎవరికీ మంచివి కావు. మా కుటుంబం పడిన వేదన భవిష్యత్‌లో మరొకరికి రాకూడదు.’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.