
ముత్తలూరులో ఉద్రిక్తత
వక్ఫ్ బోర్డు స్థలాలంటూ నోటీసులు
● ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలన్న రెవెన్యూ సిబ్బంది ● తిరగబడిన గ్రామస్తులు
రుద్రవరం: మండల పరిధిలోని ముత్తలూరులో మంగళవారం రెవెన్యూ సిబ్బంది, కాలనీ వాసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మీరు నివసించే స్థలాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని, వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని రెవెన్యూ సిబ్బంది కాలనీ వాసులను హెచ్చరించారు. అయితే 1967లో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలాగని కాలనీవాసులు నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలివీ.. ముత్తలూరు 146 సర్వే నంబరులో 3.36 ఎకరాల పొలం ఉంది. అయితే అక్కడ నివసించిన పూర్వీకులు ముళ్ల వంశీయులు కొంత మంది ఇవన్నీ తమ భూములేనని ఎవరికి వారు వివిధ సామాజిక వర్గాల వారికి విక్రయించి రిజిస్ట్రేన్ చేయించారు. దాదాపు 55 ఏళ్ల నుంచి కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగు నీటి సౌకర్యం వంటి వసతులు కల్పించారు. అయితే కొద్ది కాలంగా ఆ స్థలాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని, కొలతలు వేసి స్వాధీనం చేసుకుంటామని ఆ శాఖ ఇన్స్‌పెక్టర్ షేక్ ఇమ్రాన్ కాలనీ వాసులు 45 మందికి నోటీసులు పంపించారు. 6వ తేదీన కొలతలు వేస్తున్నామని, సహకరించాలని కాలనీవాసులకు రెండో నోటీసు పంపించారు. అలాగే 146 సర్వే నంబరుపై కొలతలు వేయించి తమ స్థలాలను అప్పగించాలని తహసీల్దారును కోరారు. దీంతో తహసీల్దారు మండల సర్వేయరు రమణ, ఓబులేసు, వీఆర్వో, వీఆర్‌ఏలు అందరూ కలిసి కాలనీలోకి వెళ్లారు. అక్కడ సర్వేయర్ కాలనీ వాసులను పిలిచి కొలతలు వేస్తున్నామని చెప్పడంతో ఎలా వేస్తావని, ఆ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించారు. ఎన్నో ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్న తమను ఖాళీ చేయమనడం సబబు కాదని వాపోయారు. తాము ముల్లా వారితో కొన్న స్థలాలని, క్రయ విక్రయాలు జరిగే సమయంలో వక్ఫ్ బోర్డు అధికారులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఇదిలాఉంటే ఇంత జరుగుతున్న సమస్యకు కారణమై వక్ఫ్ బోర్డు ఇన్స్‌పెక్టర్ మాత్రం అక్కడికి రాకపోవడం గమనార్హం.

ముత్తలూరులో ఉద్రిక్తత