
సూత్రాలను చట్టాలు ఉల్లంఘిస్తే సమీక్ష తప్పనిసరి
మధిర: రాజ్యాంగంలో సూత్రాలను శాసనసభలో చేసే చట్టాలు ఉల్లంఘించినప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిందేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. మధిరలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యాన శనివారం ఏర్పాటుచేసిన న్యాయవాదుల శిక్షణా తరగతులకు హాజరైన ఆయన.. ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ తదితర అంశాలపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాఖల పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉన్నందున ఒకరి పాత్రలోకి మరొకరు చొచ్చుకుపోకూడదన్నారు. ఎప్పుడైతే శాసన, కార్యనిర్వాహక శాఖలు న్యాయవ్యవస్థలోకి చొచ్చుకొచ్చి ప్రభావితం చేయాలని చూస్తాయో అప్పుడు వాటి మధ్య సంబంధం తెగిపోతుందని పేర్కొన్నారు. కాగా, శాసనసభలో ఆమోదం పొందే చట్టాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు లేనప్పుడు న్యాయవ్యవస్థ రూపం ప్రజాస్వామ్యంలో కనుమరుగైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కంప్యూటర్ కాలంలోనూ దేశ ప్రజలు కోర్టులపై నమ్మకాన్ని పోగొట్టుకోలేదని పలు సందర్భాల్లో నిరూపితమైందని తెలిపారు. ఎంతమంది యువ న్యాయవాదులు ఈ వృత్తిలోకి వస్తే అంత త్వరగా కేసులు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుతం న్యాయవ్యవస్థ అత్యంత ఖరీదైనదిగా మారిందని, సామాన్యుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి లేదని చంద్రకుమార్ తెలిపారు. న్యాయవాదులు ప్రజా సంబంధాలు కొనసాగిస్తూ పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి న్యాయ పరిజ్ఞానాన్ని కల్పించాలని, కార్మికులకు హక్కుల గురించి తెలియజేయాలని సూచించారు. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ జనార్దన్, సీనియర్ న్యాయవాది మామిడి హనుమంతరావు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణా తరగతులకు ప్రారంభానికి ముందు మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తిని ఐఏఎల్ బాధ్యులు సన్మానించారు. ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఉదయ భాస్కర్, సహాయ కార్యదర్శులు పి.పట్టాభి, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భాగం మాధవరావుతో పాటు పారుపల్లి అమర్ చంద్, కోటం రాజు, మునిగడప వెంకటేశ్వర్లు, శాంతకుమారి, తెల్లప్రోలు వెంకటరావు, కావూరి రమేష్, షేక్ ఇమావళి, నెల్లూరి రవికుమార్, గంధం శ్రీనివాసరావు షేక్ నస్రీన్, అరుణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు పాల్గొన్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్