
ఈ బ్యాంకు.. ‘బంగారం’!
● ఆభరణాల తాకట్టుపై డీసీసీబీలో సులువుగా రుణాలు ● ఉమ్మడి జిల్లాలోని 50 బ్రాంచ్‌ల ద్వారా రూ.765 కోట్లు ● రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఖమ్మం డీసీసీబీ
నేలకొండపల్లి: ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలతో పోలిస్తే నిబంధనలు సరళంగా ఉండడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ద్వారా బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కొత్తగా ఇచ్చిన రుణాలే కాక, రెన్యూవల్ కలిపి ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పటివరకు బ్యాంకులోని బ్రాంచ్‌ల ద్వారా రూ.765 కోట్ల రుణాలు మంజూరు చేయడం రికార్డుగా నిలిచింది.
50 బ్రాంచ్‌లు
ఖమ్మం డీసీసీబీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలే కాక మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కలిపి 50 డీసీసీబీ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. కొన్ని నెలలుగా బంగారం తాకట్టు రుణాలపై బ్యాంక్ అధికారులు విస్తృత ప్రచారం చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంతా సక్రమంగా ఉంటే పది నిమిషాల్లోనే రుణం మంజూరు చేస్తామని ప్రకటించడమే కాక దానిని పక్కాగా అమలు చేశారు. దీంతో డీసీసీబీ పరిధిలోని శాఖల్లో పలువురు కొత్తగా రుణాలు తీసుకోగా, గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న వారు రెన్యూవల్ చేసుకున్నారు. నిబంధనలు సరళంగా ఉండటం, జాప్యం లేకుండా రుణం మంజూరు కావడంతో తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలా డీసీసీబీ పరిధిలోని బ్రాంచ్‌ల ద్వారా ఇప్పటి వరకు 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రుణాల్లో రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో నల్లగొండ నిలిచింది. కాగా, ఆ రుణాల ద్వారా బ్యాంకుకు రూ.కోట్లలో వడ్డీ సమకూరనుంది.
సమష్టి కృషితోనే సాధ్యం..
బంగారం రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు సమష్టిగా ప్రచారం చేయడమే కాక నిబంధనల మేరకు త్వరగా రుణాలు మంజూరు చేస్తుండడంతో మంచి స్పందన లభించింది. ఇప్పటికే రూ.765 కోట్ల రుణాలు ఇవ్వగా.. వారం పది రోజుల్లో రూ.800 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాం.
– ఎన్.వెంకట్‌ఆదిత్య, సీఈఓ, డీసీసీబీ

ఈ బ్యాంకు.. ‘బంగారం’!