
తొలి పండుగ..
● ఇప్పటి నుంచి హిందువుల పండుగలు షురూ ● పేలాల పిండికి ప్రత్యేక స్థానం
నేడు తొలి ఏకాదశి
ఖమ్మంగాంధీచౌక్: ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి హిందూ పండుగలు మొదలవుతాయి. ఆనందంతో పాటు ఆరోగ్యానిచ్చే పండుగ ఇది. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వ దినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా పిలుస్తారు. దీనినే ‘శయన ఏకాదశి’‘హరి వాసరం’‘పేలాల పండుగ’అని కూడా అంటారు. ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని పండగగా జరుపుకునేందుకు హిందువులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు, ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈరోజున చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ విష్ణుమూర్తి నామస్మరణతో పూజలు చేస్తారు.
ఏకాదశి నియమాలు
ఏకాదశి రోజు మొత్తం నిరాహారులై ఉండాలి. ఏకా దశి రోజున సూరోదయానికి ముందుగానే శ్రీహరిని పూజించాలి. విష్ణుమూర్తి ప్రతిమను పసుపుకుంకుమలతో పూలతో అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి కర్పూర హారతినిస్తారు. ఈ రోజున కాల్చివండినవి, మాంసాహారం, ఉసిరి, ఉలవలు, మినుములు, వెల్లుల్లి వంటివి తినొద్దని పండితులు చెబుతున్నారు.
పేలాల పిండి ఆరోగ్యం..
తొలి ఏకాదశి రోజు పేలాల పిండికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృ దేవతలకు ఎంతో ఇష్టమైనవని.. జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజున గుర్తు చేసుకోవటం మన బాధ్యత అని పెద్దలు చెబుతుంటారు. అంతేగాక ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తరువాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం. ఈ కాలంలో పేలాల పిండి తింటే శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఈ రోజున మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దేవాలయాల వద్ద, ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.
మార్పులకు సంకేతం..
ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతం తొలి ఏకాదశి. సూర్య భగవానుడు ఈ రోజు నుంచి దక్షణా యనం వైపునకు మరలుతాడు. హిందువులు తొలి ఏకాదశిని తొలి పండుగగా జరుపుకుంటారు. రైతు లకు ఈ పండుగ ప్రత్యేకం. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రజలు తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు, జాగరణ చేస్తారు.
–నందుల సుబ్రహ్మణ్యశర్మ, పురోహితులు
రైతుల పండుగ
తొలిఏకాదశి రైతుల పండుగగా పురాణాలు చెబు తున్నాయి. రైతులు ఈ పండుగను వేడుకలా జరుపుకుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా వేసిన పంటలకు ఎలాంటి తెగుళ్లు ఆశించకుండా ఉండాలని అన్నదాతలు తొలి ఏకాదశిరోజున ఇళ్లలో, ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేస్తారు. వర్షాలు అనుకూలిస్తే వాగుల్లో, జలాశయాల్లో నీరు ప్రవహిస్తుంది. వాగు ల్లో వర్షపునీరు ముందుగా ప్రవహిస్తే ఏరు ముందని, అంతగా వర్షాలు లేకపోతే ఏకాశి ముందని రైతులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వర్షాలు అనుకూలించి పంటలు పండాలని ఏకాదశి రోజున అన్నదాతలు భగంవతున్ని ప్రార్థిస్తుంటారు.