
ఎంపీడీఓల బదిలీలు
ఖమ్మంసహకారనగర్: గత ఎన్నికల సమయంలో ఎంపీడీఓల బదిలీలు జరగ్గా.. వారి వారి ప్రాంతాలకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ డైరెక్టర్ జి.శ్రీజన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న జి.సురేందర్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేయగా.. జి.రవీందర్, ఎస్. కుమార్, బి.వేణుగోపాల్‌రెడ్డి, పి.సరస్వతి, ఎ.రోజారాణిని మహబూబాబాద్ జిల్లాకు బది లీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కావూరి మహాలక్ష్మిని ఖమ్మంకు బదిలీ చేశారు. వీరంతా వెంటనే ఆయా జిల్లాల్లో విధుల్లో చేరనున్నారు.
దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బడేసాహెబ్
ఖమ్మంఅర్బన్: తెలంగా ణ దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ బడేసాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలోని కొత్తగూడెంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరగగా ఆయన మా ట్లాడారు. సంఘం బలోపేతానికి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఫకీర్ సాహెబ్, గాలిబ్ సాహెబ్ ఎనలేని కృషి చేశారని, వారి ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. షేక్ సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పుల్లాసాహెబ్, నాయకులు షేక్ మీరా, మహమ్మద్ అబ్దుల్ కలాం, షేక్ అన్వర్‌పాషా, షేక్ మీరాసాహెబ్, షేక్ మౌలాలీ, షేక్ ఉద్దండుసయ్యద్, అన్వర్‌పాషా, షేక్ లతీఫ్, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ముదిగొండ: పరీక్షల్లో ఫెయిల్ ఆయ్యాననే నమస్తాపంతో బీటెక్ విద్యార్థి వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వల్లాపురంలో శనివారం చోటుచేసుకుంది. వల్లాపురానికి చెందిన ఇండెమందుల యశ్వంత్ (19) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల అమ్మమ్మ గారి ఊరైన వనంవారికిష్టాపురం వెళ్లాడు. కాగా, తొలి సెమిస్టర్ ఫలితాలు రాగా అందులో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపంతో శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి రాలేదు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. మరుసటి రోజు వనంవారికిష్టాపురం శివారులోని వ్యవసాయబావిలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదుపై సీఐ మురళి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి డబ్బులివ్వలేదని..
రఘునాథపాలెం: మద్యం తాగేందుకు తల్లిని డబ్బులడిగితే ఇవ్వలేదంటూ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.నాగేంద్రబాబు(30) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం తల్లి భద్రమ్మను డబ్బు అడగగా ఆమె ఇవ్వలేదు. తల్లితో కాసేపు ఘర్షణ పడిన నాగేంద్రబాబు ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా శనివారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉస్మాన్‌షరీప్ తెలిపారు.