
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
ఖమ్మంమయూరిసెంటర్: సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డిభవన్‌లో బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మొక్కా శేఖర్‌గౌడ్, సయ్యద్‌గౌస్, సయ్యద్ ముజాహిద్, హుస్సేన్, గజ్జెల్లి వెంకన్న, మలీదు వేంకటేశ్వరరావు, లకావత్ సైదులునాయక్, దుద్దుకూరి వేంకటేశ్వరరావు, యడ్లపల్లి సంతోష్, జెర్రిపోతుల అంజనీకుమార్, మిక్కిలినేని నరేంద్ర, కొట్టేముక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..
● వ్యక్తి దుర్మరణం
ములకలపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. కొత్తగంగారం అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఇలా తెలిపారు. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కుర్సం అర్జున్‌రావు(38) స్నేహితులతో కలిసి ట్రాక్టర్‌పై ములకలపల్లి మండలంలోని పాతగుండాలపాడు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మూత్రవిసర్జన నిమిత్తం ట్రాక్టర్‌ను కొత్తగంగారం అటవీ ప్రాంతంలో ఆపగా.. అటు వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న అర్జున్‌రావు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి స్వాధీనం
● నలుగురిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి సోములగూడెం వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఎస్సై సురేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో జామాయిల్ తోటలో పాల్వంచకు చెందిన షకీర్, గోపి, జగన్నాధపురం గ్రామానికి చెందిన చరణ్, శ్రీరాంలు అనుమానస్పదంగా సంచరించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారి వద్ద ఒరిస్సాలోని బెజంగూడా నుంచి రూ.19వేల విలువ కలిగిన 380 గ్రామాల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.