
ఉన్నత చదువులకు ‘ఓపెన్’
● పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం ● ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 56 స్టడీ సెంటర్లు
ఖమ్మంసహకారనగర్: ఓపెన్ స్కూల్ అనేది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఓ వరం లాంటిది. వివిధ కారణాలతో విద్యను అభ్యసించలేకపోయిన వారు, చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు, తమ వయసుతో సంబంధం లేకుండా మళ్లీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదవకాశాన్ని ఇచ్చింది. ఓపెన్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఈ ఓపెన్‌స్కూల్స్‌లో చేరేందుకు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2008వ విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానం ప్రారంభం కాగా.. అప్పటి నుంచే పదో తరగతి ప్రారంభించారు. 2010–11వ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు.
56 కేంద్రాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 56 ఓపెన్ స్కూల్ కేంద్రాలుండగా... అందులో ఖమ్మం జిల్లాలో 25 సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 కేంద్రాలున్నాయి. చిన్నప్పటి నుంచి చదువుకోకపోయినా సరే నేరుగా పదో తరగతిలో చేరే అవకాశం వీటి ద్వారా కలుగుతుంది. వయోజనులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తాము ఉన్నత విద్యావంతులుగా మారేందుకు కృషి చేసుకోవచ్చు.
అర్హతలిలా...
పదో తరగతిలో చేరాలనుకునే వారికి 31–08–2025 నాటికి 14 సంవత్సరాలు నఉండాలి. ఇంటర్మీడియట్‌లో చేరేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. చదివిన తరగతులకు సంబంధించిన టీసీ, బోనఫైడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారు మాత్రం తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ నెల 11వ తేదీ తుది గడువు..
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం పొందాలనుకునే ఈ నెల11వ తేదీ వరకు దరఖాస్తులు అధ్యయన కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా అపరాధ రుసుం పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్‌కు రూ.200లతో ఆగస్టు(వచ్చే నెల) 12వ తేదీ వరకు మీ సేవా, ఆన్‌లైన్ కేంద్రాల్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజులు
పదో తరగతికి జనరల్ పురుషులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీలు, మహిళలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్మీడియట్‌కు జనరల్ పురుషులకు రూ.1,800, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగులకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి అడ్మిషన్ పొందేందుకు గాను వయస్సు ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీని తెలిపే ఏదైనా పాఠశాల రికార్డు షీట్/టీసీ లేదా మున్సిపల్ అధికారి/ తహసీల్దార్/జిల్లా జనన మరణ రిజిస్ట్రార్ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువపత్రం సమర్పించాలి. వచ్చే నెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉన్న వారు తమ ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు తీసుకెళ్లాలి. అలాగే ఇంటర్‌లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అదనంగా సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త కేంద్రాలివే...
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరుగుతున్న క్రమంలో జిల్లాలో కొత్తగా జెడ్పీహెచ్‌ఎస్ రఘునాథపాలెం, జెడ్పీహెచ్‌ఎస్ ఏదులాపురం, జీహెచ్‌ఎస్ నేలకొండపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ తల్లాడలలో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీహెచ్‌ఎస్ కరకగూడెం, అశ్వాపురం మండలం జెడ్పీహెచ్‌ఎస్ మిట్టగూడెం, జెడ్పీహెచ్‌ఎస్ ఆళ్లపల్లి, జీహెచ్‌ఎస్ టేకులపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ చండ్రుగొండ, జెడ్పీహెచ్‌ఎస్ ఎర్రగుంట (అన్నపురెడ్డి మండలం), జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మీదేవిపల్లిలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గత మూడేళ్లలో అడ్మిషన్లు, ఫలితాలిలా..
ఖమ్మం జిల్లా
సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాల శాతం
2022–23 770 26.3 995 48.53
2023–24 789 40.44 881 44.71
2024–25 607 40.44 797 57.93
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
2022–23 671 23.66 856 40.48
2023–24 623 32.28 788 50.97
2024–25 538 31.04 728 51.19
సద్వినియోగం చేసుకోవాలి
ఉన్నత చదువులు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశం. చదువులు మధ్యలో ఆపేసిన వారు, చదవాలనుకునే వారు ఇందులో అడ్మిషన్ పొందొచ్చు. పది, ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారు ఈ నెల 11 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. – సామినేని సత్యనారాయణ,
జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం
ఉన్నత విద్యకు దోహదం
ఓపెన్ స్కూల్‌లో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారున్నారు. అభ్యర్థుల ఆసక్తి మేరకు ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కొత్తగా 11 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అధ్యయన కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి.
– మద్దినేని పాపారావు,
ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్

ఉన్నత చదువులకు ‘ఓపెన్’

ఉన్నత చదువులకు ‘ఓపెన్’