
మోదీ పాలనలో ఉద్యోగాలు లేవు..
ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో రిటైర్మెంట్‌లు తప్ప రిక్రూట్‌మెంట్‌లు లేవని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఖమ్మం నగర 5వ మహాసభ ఆదివారం నగరంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించారు. సభకు ముందు నగరంలో సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. హేమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యమైందని, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని విమర్శించారు. అలీన విధానానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 మాసాలు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బీజీ క్లెమెంట్, నగర కార్యదర్శి జానీమియా, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, జ్వాలా నర్సింహారావు, యానాలి సాంబశివారెడ్డి, నూనె శశిధర్, ఏనుగు గాంధీ పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు
హేమంతరావు