
పరిహారం స్వాహాపై కదలిక
తిరుమలాయపాలెం: భారీ వర్షాలు, వరదలతో ఆవులు, గేదెలు కొట్టుకుపోయి నష్టపోయిన రాకాసితండా రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని మండల వెటర్నరీ డాక్టర్ భర్త వేరే ఖాతాకు మళ్లించిన ఘట నపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘పశువుల పేరిట పరిహారం స్వాహా? కథననంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం స్థానిక వెటర్నరీ డాక్టర్‌ను వివరణ కోరుతూ లేఖ పంపించినట్లు సమాచారం. పశువైద్యాధికారిణి భర్త రాకాసితండాలో ఓ రైతుకు చెల్లించాల్సిన డబ్బులను వేరే ఖాతాకు మళ్లించడంతో ఆ రైతు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి పురంధర్‌ను వివరణ కోరగా.. మండల పశువైద్యాధికారి వివరణ కోరామని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు.