
ముగ్గురు నకిలీ విత్తనాల విక్రేతల అరెస్ట్
తల్లాడ: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు వచ్చిన ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మగ్గురు పరారయ్యారు. వారి వద్ద నుంచి తొమ్మిది నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కాచారం గ్రామానికి చెందిన బ్రహ్మాజీ, ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామానికి చెందిన బాలగాని గోపి, కె.పర్వ గ్రామానికి చెందిన మంగరాజు గోపి, తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన గంధం కోటేశ్వరరావు, జంగా గోపాల్‌రెడ్డి, పోట్రు శ్రీను ముఠాగా ఏర్పడి మిట్టపల్లి పరిసర గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తల్లాడ ఎస్‌ఐ వెంకటకృష్ణ, ఏఓ ఎండీ తాజుద్దీన్ శుక్రవారం రాత్రి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. రూ.12వేల విలువైన తొమ్మిది అరుణోదయ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగరాజు గోపి, బాలగాని గోపి, గంధం కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. బ్రహ్మాజి, గోపాల్‌రెడ్డి, శ్రీను పరారీలో ఉన్నారు.