
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలో మోదీ ప్రభంజనం బలంగా వీస్తోందని.. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన పార్లమెంటరీ బూత్ కమిటీ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఖమ్మంలోనూ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు విజయం ఖాయమైందని చెప్పడానికే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవనుండగా.. ఆ జాబితాలో ఖమ్మం సైతం ఉంటుందని తెలిపారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు గెలవనుండగా.. ఖమ్మంలో సైతం విజయం ఖాయమని చెప్పారు. ఇందుకోసం ప్రతీ కార్యకర్త మోదీ సైనికుడిగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థికికి ఓట్లు వేసేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం అభ్యర్థి వినోద్‌రావు మాట్లాడగా.. అనంతరం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారాయణతో పాటు నంబూరి రామలింగేశ్వరావు, శ్యాంరాథోడ్, కిరణ్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్
అభయ్‌పాటిల్