లోటు వర్షపాతమే... | - | Sakshi
Sakshi News home page

లోటు వర్షపాతమే...

Jul 2 2025 5:48 AM | Updated on Jul 2 2025 5:48 AM

లోటు వర్షపాతమే...

లోటు వర్షపాతమే...

● జూన్‌లో కరుణించని వరుణుడు ● నెలంతా ఏడు రోజులే వాన ● ఫలితంగా ఊపందుకోని పంటల సాగు

ఖమ్మంవ్యవసాయం: గడిచిన జూన్‌ నెలలో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో సగటున 131.2 మి.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా.. 123.9 మి.మీ.కే పరితమైనట్లు అధికారులు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాక నెల మొత్తంలో కేవలం ఏడు రోజులే వర్షం కురిసింది. జిల్లాలోని 21 మండలాలకు ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, పది మండలాల్లో సాధారణ వర్షపాతం, మూడు మండలాల్లో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదైందని నివేదికలో వెల్లడించారు. ఈమేరకు సింగరేణి, కామేపల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్‌ మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, సాధారణానికి మించి కొణిజర్ల, పెనుబల్లి, తల్లాడలో వర్షపాతం నమోదైంది.

చివరి వారంలోనే..

మే నెల చివరి వారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన ఉండగా రోహిణి కార్తె ఆరంభంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అప్పటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకలేదు. అయినా అప్పటి వర్షాలకు జిల్లాలోని రైతులు పత్తి, పెసర వంటి మెట్ట పంటలు విత్తుకున్నారు. కానీ జూన్‌ ఆరంభం నుంచి వర్షాలు మొఖం చాటేయడంతో అన్నదాతలు ఎదురుచూపుల్లో గడపాల్సి వచ్చింది. మృగశిర కార్తెలో ఒకటి, రెండు రోజులు చిరు జల్లులు కురవగా.. జూన్‌ 22న ఆరుద్ర కార్తె ప్రవేశించాకే వర్షాలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో మొత్తం ఏడు రోజులేవర్షం కురవగా.. నెలాఖరులో కురిసిన వర్షాలతో కొంత మేర లోటు పూడినట్లయింది.

గత ఏడాదితో విస్తారంగా వాన

గత ఏడాది జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నెలలో జిల్లా సగటు వర్షపాతం 124.6 మి.మీ.కు గాను 197.8 మి.మీ.గా నమోదు కావడం విశేషం. కానీ ఈసారి జూన్‌లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది.

నత్తనడకన సాగు

ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పంటల సాగు నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఈ వానాకాలం అన్ని పంటలు కలిపి 6,07,165 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా, జూన్‌ చివరి వరకు 2,12,997 ఎకరాల్లోనే పంటలు వేశారు. తొలకరిలో సాగు చేయాల్సిన మెట్ట పంటల సాగు లక్ష్యం భారీగావెనకబడింది. పత్తి లక్ష్యం 2,20,550 ఎకరాల్లో 1,35,114 ఎకరాల్లోనే విత్తనాలు నాటారు. ఇక పెసర 17,790 ఎకరాలకు గాను 6,549 ఎకరాల్లో, పచ్చిరొట్ట సుమారు 54 వేల ఎకరాల్లో వేశారు. అలాగే, జిల్లాలో ప్రధాన పంటగా సాగయ్యే వరి లక్ష్యం 2,95,100 ఎకరాలు కాగా, ఇప్పటివరకు నేరుగా, నాటు పద్ధతిలో 16,142 ఎకరాల్లో పంట వేశారు. మరో 34,359 ఎకరాలకు సరిపడా నార్లు పోశారు. వర్షాలు జోరందుకుని, నాగార్జునసాగర్‌ నుంచి నీరు విడుదలైతే జూలై, ఆగస్టు నెలల్లో పంటల సాగు లక్ష్యాన్ని చేరే అవకాశముంది.

గత నెలలో మండలాల వారీగా నమోదైన వర్షపాతం (మి.మీ.ల్లో)

మండలం నమోదు నమోదైన

అంచనా వర్షపాతం

సింగరేణి 144.2 81.6

కామేపల్లి 142.1 93.0

రఘునాథపాలెం 130.9 99.4

ఖమ్మం రూరల్‌ 129.1 131.6

తిరుమలాయపాలెం 115.2 93.6

కూసుమంచి 112.8 53.2

నేలకొండపల్లి 117.1 87.6

ముదిగొండ 111.5 82.4

చింతకాని 120.9 87.6

ఖమ్మం అర్బన్‌ 133.3 101.6

కొణిజర్ల 124.6 164.4

ఏన్కూరు 151.0 141.0

కల్లూరు 139.8 156.2

పెనుబల్లి 136.8 182.0

సత్తుపల్లి 152.6 168.2

వేంసూరు 135.6 156.6

తల్లాడ 133.7 200.6

వైరా 133.1 149.8

బోనకల్‌ 123.8 127.6

మధిర 126.1 123.6

ఎర్రుపాలెం 137.4 120.6

జిల్లా వ్యాప్తంగా వర్షం

జిల్లాలో అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా, మంగళవారం సైతం జల్లులు కొనసాగాయి. అయితే, జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహబూబాబాద్‌, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన వర్షంతో మున్నేరు, ఆకేరు నుంచి ప్రవహిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి స్వల్పంగా మొదలైన వరద మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద తీగల వంతెన నిర్మాణం కారణంగా చప్టాపై రాకపోకలు నిలిపేశారు. దీంతో ఖమ్మం కాల్వొడ్డు మీదుగా నాయుడుపేట, వరంగల్‌ క్రాస్‌ వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, మంగళవారం జిల్లాలో 3.08 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కల్లూరు మండలంలో అత్యధికంగా 6.22 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. సత్తుపల్లిలో 5.72, కామేపల్లిలో 4.24, తల్లాడలో 3.94, పెనుబల్లిలో 3.72, కొణిజర్లలో 3.68, తిరుమలాయపాలెంలో 3.48, రఘునాథపాలెంలో 3.42, ఏన్కూరు, వేంసూరులో 3.28, ఖమ్మం అర్బన్‌లో 3.24, వైరా 3.22, ఖమ్మం రూరల్‌లో 2.88, సింగరేణి, ఎర్రుపాలెంలో 2.54, నేలకొండపల్లిలో 2.36 సెం.మీ.ల వర్షపా తం నమోదైందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement