
నాయకులకు క్రమశిక్షణే ముఖ్యం
● ఖర్గే పర్యటన విజయవంతానికి పాటుపడాలి ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంమయూరిసెంటర్: రాజకీయాల్లో కొనసాగాలనుకునే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన పట్టణ, మండల, గ్రామ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏ స్థాయి నాయకుడైనా ప్రజాభిమానం పొందాలంటే క్రమశిక్షణ తప్పనిసరని చెప్పారు. జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే ఈనెల 4న హైదరాబాద్ వస్తున్నందున జిల్లా నుంచి భారీగా శ్రేణులను తరలించేలా కృషి చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తన మనుగడను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్ చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఈసమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, నాయకులు శ్రావణ్ కుమార్‌రెడ్డి, చక్కిలం రాజేశ్వర్‌రావు, రవీందర్ మాట్లాడగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు మహ్మద్ జావేద్, బాలసాని లక్ష్మీనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, తుంబూరు దయాకర్‌రెడ్డి, బాలగంగాధర్ తిలక్, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్‌గౌడ్, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ఇళ్లు
రఘునాథపాలెం: దశల వారీగా నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గుడిసెల్లో ఉంటున్న వారికి తొలివిడత ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్డీఓ నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ పవార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్‌కుమార్‌తో పాటు దిరిశాల వెంకటేశ్వర్లు, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, వాంకుడోత్ దీపక్, జానబోయిన పాపయ్య, వెంకటరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.