
మైనార్టీ పాఠశాలల ఆర్‌సీఓగా అరుణకుమారి
కొణిజర్ల: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ మైనార్టీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వయకర్త(ఆర్‌సీఓ)గా ఎం.జే.అరుణకుమారి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం కొణిజర్ల మండలం అమ్మపాలెం మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆర్‌సీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పర్యవేక్షిస్తానని తెలిపారు.
పలువురు సీఐల బదిలీ
ఖమ్మంక్రైం: జిల్లాలోని వివిధ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ పోలీస్ స్టేషన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేయగా, అక్కడి సీఐ టి.కిరణ్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న నల్లమోతు చిట్టిబాబును మహిళా పోలీస్ స్టేషన్‌కు, తాండూరు సీఐ కన్నం కుమారస్వామిని మధిరకు బదిలీ చేయగా.. అక్కడ పనిచేస్తున్న దొంగరి మధును ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.