
అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
● మరింతగా ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయగా.. అన్నివర్గాల సంక్షేమానికి మరింత పాటుపడతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌తో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ పనులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అలాగే, ఎంపీడీఓ కార్యాలయంలో మున్నేరు కేబుల్‌బ్రిడ్జి నిర్మాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాక ఆయన మాట్లాడారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్ చెల్లించిన ఘనత తమదేనని తెలిపారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఈ విషయంలో ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి సూచించారు. కాగా, కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని మంత్రి వెల్లడించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేలా పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఏసీపీ కార్యాలయం ప్రారంభం
ఖమ్మం రూరల్ ఏసీపీ నూతన కార్యాలయంతో పాటు ఆధునికీకరించిన రూరల్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. బాధితులు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి సమ స్యలు చెప్పుకునేలా వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ నర్సింహారావు, ఏదులాపురం మున్సి పల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏసీపీలు తిరుపతిరెడ్డి, రమణమూర్తి పాల్గొన్నారు.
నేడు కూసుమంచిలో పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలం ధర్మతండా, కోక్యాతండా, లోక్యాతండా, గన్యాతండాతో పాటు కూసుమంచిలో రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.