
మామిడి.. రైతుల్లో అలజడి
జిల్లాలోని వేంసూరు మండలం కొన్నేళ్ల క్రితం వరకు మామిడి తోటలకు చిరునామాగా నిలిచేది. ఇక్కడే ఎక్కువ తోటలు ఉండేవి. తద్వారా రైతులకే కాక సీజన్‌లో వేలాది మందికి ఉపాధి లభించేది. ఈ ప్రాంతం ఉంచి దక్షిణాది రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేసిన దాఖలాలు ఉన్నాయి. రానురాను తెగుళ్లు, మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు మామిడిపై నిరాసక్తత కనబరుస్తున్నారు. ఫలితంగా కొత్త తోటలు వేయకపోగా.. పాత తోటలను సైతం పలువురు తొలగిస్తుండడం గమనార్హం. –వేంసూరు
● తెగుళ్లు, ధరలో నష్టంతో తోటలు తొలగిస్తున్న వైనం ● ఇదేక్రమాన పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు ● సుదీర్ఘకాలం దిగుబడికి అవకాశం ఉండడంతో మొగ్గు
జిల్లాలో 60 వేల ఎకరాల నుంచి..
దశాబ్ద కాలం క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 60వేల ఎకరాల్లో మామిడి సాగయ్యేది. ఇందులో ఒక్క వేంసూరు మండలంలోనే 25వేల ఎకరాల తోటలు ఉండేవి. అప్పట్లో కరువు మండలంగా పేరొందిన వేంసూరులో భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉండడంతో మామిడి ప్రధాన పంటగా కొనసాగేది. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులతో మామిడి సాగు చేస్తే రైతులకు ఏటా నష్టాలు తప్ప లాభాలు లేకపోవడంతో తోటలు తొలగిస్తున్నారు. వేంసూరు మండలంలో 25వేలుగా ఉన్న తోటలు ఇప్పుడు 7,012 ఎకరాలకు పడిపోవడం చర్చకు దారి తీస్తోంది. ఇక జిల్లాలోనూ గతంలో 60వేల ఎకరాలకు పైగా తోటలు ఉండగా.. ఇప్పుడు 31,988 ఎకరాలకు పడిపోయింది.
కల్లురుగూడెంలో ఫ్యాక్టరీ
జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు ఆయిల్‌పామ్ గెలలను అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. అయితే, రైతులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో వేంసూరు మండలం కల్లురుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉగాది రోజున శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతులకు దూరాభారం తగ్గుతుంది. అలాగే, ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మూడేళ్లు ఏటా రూ.4,500 అందించడంతో పాటు ఇతర రాయితీలు కల్పిస్తుండడం చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అంతేకాక చీడపీడల ఉధృతి ఉండకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, కోతుల బెడద లేకపోవడంతో సాగు పెరుగుతోంది. 2020–21 ఏడాదిలో జిల్లా అంతటా 6,192 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు కాగా.. ఇప్పుడు అది 34,491 ఎకరాలకు పెరగడం రైతుల ఆసక్తిని తెలియచేస్తోంది.
చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు
మామిడి తోటలను ఏటా ఏదో ఒక తెగులు వ్యాపిస్తోంది. పూత దశలో మంచు పురుగు, ఆతర్వాత మంగు తెగుళ్లు వంటివి ఆశిస్తుండడమే కాక వేసవిలో కాత వస్తున్నప్పుడు గాలిదుమారం కారణంగా దిగుబడి పడిపోతోంది. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసినా మార్కెట్‌లో సరైన ధర లభించడం లేదు. ఇలా రకరకాల కారణాలతో ఎగుమతులపై ఆధారపడిన రైతులు మామిడి సాగుకు దూరమతున్నారు.
ఆయిల్‌పామ్‌తో లాభాలు
ఆయిల్‌పామ్ రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు లేకపోగా కోతుల బెడద ఉండదు. కల్లూరుగూడెం ఫ్యాక్టరీ ఏర్పాటు కానుండడంతో ఆయిల్‌పామ్ మొక్కలు నాటాను.
– రావి సత్యనానాయణ, అడసర్లపాడు
ఏటా నష్టాలే..
వరుసగా నాలుగేళ్ల నుంచి మామిడి సాగుకు పెట్టుబడి తప్ప లాభాలు రావడం లేదు. వరుస నష్టాలతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. చివరకు మామిడి తోటలను తొలగించి ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నాం.
– అట్లూరి సత్యనారాయణరెడ్డి, అడసర్లపాడు

మామిడి.. రైతుల్లో అలజడి

మామిడి.. రైతుల్లో అలజడి

మామిడి.. రైతుల్లో అలజడి