
లారీ బోల్తా.. ఉల్లిగడ్డలు మాయం!
వైరా: ఉల్లి గడ్డల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడగా.. అందులోని ఉల్లిగడ్డలను స్థానికులు తీసుకెళ్లిన ఘటన వైరా మున్సిపాలిటీ శివారు శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డల లోడుతో రాజమహేంద్రవరం వెళ్తున్న లారీ మంగళవారం తెల్ల వారుజామున అదుపు తప్పి రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం తెలియడంతో శాంతినగర్, దిద్దుపూడి గ్రామస్తులు చేరుకుని దొరికనంత మేర ఉల్లిగడ్డల బస్తాలు తీసుకెళ్లారు. ఆతర్వాత చేరుకున్న లారీ యజమానులు మరో లారీలో ఉల్లిగడ్డలను పంపించారు.
లాభాల పేరిట నగదు స్వాహా
చింతకాని: ప్రముఖ సంస్థల్లో పెట్టుబడి పెడితే నగదు రెట్టింపు అవుతుందని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.28,900 స్వాహా చేశారు. మండలంలోని నాగులవంచకు చెందిన మొగిలి అశోక్ సెల్‌ఫోన్‌కు ఇటీవల సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు. ఈ లింక్‌ను ఓపెన్ చేసి కొంత నగదు పెట్టుబడి పెడితే రెట్టింపవుతుంని నమ్మించడంతో ఆయన లింక్‌ను ఓపెన్ చేయగానే ఖాతా నుంచి ఉన్న రూ.28,900 నగదు మాయమైంది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన అశోక్ చేసిన ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
ఎదురెదురుగా ఢీకొన్న కారు, డీసీఎం
వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెన సమీపాన జాతీయ ప్రధా న రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఎదురెదురుగా కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నా యి. వైరా వైపు నుండి తల్లాడ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకున్నా ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడం, భారీ వర్షం కురుస్తుండడంతో రాకపోకలు నిలిచిపోగా ఎస్సై పుష్పాల రామారావు, సిబ్బందితో చేరుకుని జేసీబీతో వాహనాలను పక్కకు తప్పించారు. దీంతో రాకపోకలు మొలయ్యాయి.

లారీ బోల్తా.. ఉల్లిగడ్డలు మాయం!