
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మధిర: మండలంలోని మడుపల్లికి చెందిన వివాహిత పారా అంజలి(21) కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సిరిపురం గ్రామానికి చెందిన తడికమళ్ల రామును తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. మధిరలోని సాయినగర్‌లో అద్దెకు ఉంటుండగా, ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, అంజలిని రాము మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై అంజలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌హెచ్‌ఓ రమేష్ కేసు నమోదు చేయగా, వైరా ఏసీపీ రహమాన్ వివరాలు ఆరా తీశారు.
గోవింద్రాల గ్రామంలో...
కామేపల్లి: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన వాంకుడోత్ ఉష(28)కు కొన్నేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో రెండు నెలల క్రితం ఆమె గోవింద్రాలలో తల్లి తేజావత్ రామీ ఇంటికి వచ్చి ఉంటోంది. ఈనేపథ్యాన గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కామేపల్లి పోలీసులు తెలిపారు.