బోనకల్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో బోనకల్ మండలం ముష్టికుంట్ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ పాఠశాల విద్యార్థులు బొడ్డుపల్లి నవ్యశ్రీ, షేక్ ఫరీదా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు. ఈమేరకు విద్యార్థులను హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, పీఈటీ నవీద్‌పాషా, ఉపాధ్యాయులు అభినందించారు.
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వైరారూరల్: విద్యార్థులు పాఠ్యపుస్తకాల ద్వారా బోధననే కాక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పెంపొందించుకోవాలని వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్ గతేడాది ఒకే విద్యార్థితో కొనసాగగా ఈసారి బడిబాట నిర్వహణతో 12మంది చేరారు. దీంతో గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాఠశాల అభివృద్ధికి రూ.6 లక్షలు కేటాయించారు. అంతేకాక ప్రస్తుత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ మరో రూ.1.55 లక్షలు మంజూరు చేయగా కంప్యూటర్ విద్యనందించేందుకు రూ.85 వేలు విలువైన రెండు కంప్యూటర్లు సమకూర్చారు. అలాగే, విద్యార్థులు ఇంటి నుంచి వచ్చివెళ్లేలా రవాణా సౌకర్యార్థం రూ. 70 వేలు కేటాయించారు. ఈమేరకు గురువారం పాఠశాలలో కంప్యూటర్లను ఎంఈఓ ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు ఉమాపార్వతి, రాంబాబు పాల్గొన్నారు.
బాలుడి మృతదేహం లభ్యం
ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని రాజీవ్ స్వగృహ వద్ద మున్నేటిలో గల్లంతైన ఖమ్మంలోని లెనిన్‌నగర్‌కు చెందిన ఎస్‌కే.అహ్మద్(14) మృతదేహం గురువారం లభ్యమైంది. ఈత కోసం మంగళవారం సాయంత్రం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు నేతృత్వాన రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఈనేపథ్యాన మృతదేహం లభించగా పోస్ట్‌మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
వైద్యురాలి ఫోన్ హ్యాక్..
●రూ.5లక్షలు వసూలు చేసిన
సైబర్ కేటుగాళ్లు
ఖమ్మంక్రైం: ఖమ్మంకు చెందిన ఓ వైద్యురాలి ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సుమారు రూ.5లక్షలను కాజేశారు. ఖమ్మం ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన డాక్టర్ స్వర్ణకుమారి ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం హ్యాక్ చేశారు. ఆపై ఆ నంబర్ ద్వారా రూ.55 వేలు కావాలంటూ ఆమె సన్నిహితులు, బంధువులకు మెసేజ్ చేశారు. దీంతో పలువురు రూ.5లక్షల మేర నిందితులు చెప్పిన నంబర్‌కు ఆన్‌లైన్‌లో పంపించారు. ఇంతలోనే కొందరు స్వర్ణలతకు ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బు ఎందుకుని ఆరా తీయడంతో తానెవరికీ మెసేజ్ చేయలేదని బదులివ్వగా మోసం బయటపడింది. దీంతో ఆమె భర్త డాక్టర్ బాబురత్నాకర్‌తో కలిసి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ముష్టికుంట్ల విద్యార్థులు