
విపత్తులు ఎదుర్కొనేలా సన్నద్ధం
● వరద ఉధృతిని సమర్థంగా అంచనా వేయాలి ● ఎన్‌డీఎంఏ అధికారులతో భేటీలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంమయూరిసెంటర్: వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశం నిర్వహించగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఎన్‌డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్, అధికారులు అభిషేక్ బిశ్వాస్, డాక్టర్ వజీం ఇక్బాల్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కన్సల్టెంట్లు గౌతంకృష్ణ తేజ, బి.అనుపమ, టీ.జే.సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది మున్నేటి వరదల సమయాన చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాక కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది వరద విపత్తు ఎదురైనా మరింత పకడ్బందీగా ఎదుర్కొనేలా అధ్యయనం చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించేలా ఉద్యోగులు, ఆపదమిత్ర వలంటీర్లను సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఎన్‌డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడారు.
లోతట్టు ప్రాంతాల పరిశీలన
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం, రూరల్ మండలాల్లోని మున్నేటి లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాష్‌నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించిన వారు వరద అంచనా, స్థానికుల అప్రమత్తతపై చర్చించారు. జిల్లా కేంద్రంలో 1077 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటైందనే విషయాన్ని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఆర్డీవో నర్సింహారావు, ఎంపీడీఓ కుమార్, తహసీల్దార్ పి.రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఏఓ కే. శ్రీనివాసరావు, డీటీ అన్సారీ పాల్గొన్నారు.