
జల వనరుల కళకళ
● వర్షాలతో నిండుతున్న చెరువులు ● గాలీవానతో కొన్నిచోట్ల కూలిన స్తంభాలు, చెట్లు
వైరారూరల్/కల్లూరురూరల్/ఏన్కూరు/ముదిగొండ/తల్లాడ: జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు వరకు గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెరువులు జలకళ సంతరించుకోగా.. గాలీవానతో చెట్లు, స్తంభాలు కూలడంతో రవాణా కు అంతరాయం ఏర్పడింది. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలోని నల్లకుంట చెరువుకు ఎగువ నుంచి వరద చేరగా చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 6.5 అడుగులకు చేరడంతో అలుగు పోస్తోంది. ఇక వైరా రిజర్వాయర్ పూర్థిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా, ప్రస్తుతం 15.5 అడుగులకు చేరింది. కాగా, కల్లూరు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పుల్లయ్య బంజరు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తుండగా తాత్కాలికంగా బ్రిడ్జి పక్కనే వేసిన మట్టిరోడ్డుపైకి నీరు చేరడంతో కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మున్సిపాలిటీ అధికారులు మరమ్మతులు చేయించి రాకపోకలు పునరుద్ధరించారు. అలాగే, ఏన్కూరు మండలంలో గురుకుల విద్యాలయం సమీపానే కాక పలుచోట్లు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. జన్నారం– ఆరికాయలపాడు మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అంతేకాక ముదిగొండలోని ఖమ్మం– కోదాడ ప్రధాన రహదారిపై చెట్టు విరిగి పడగా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సీఐ ఓ.మురళి సిబ్బందితో చేరుకుని చెట్టును తీయించారు. అంతేకాక తల్లాడ మండలంలోని కల్లూరు వాగు పొంగి ప్రవహించడంతో వెంగన్నపేట–నూతనకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంగన్నపేట సమీపాన వాగుపై వంతెన నిర్మిస్తుండగా, పక్కనే లోలెవల్ కాజ్‌వేపైకి నీరు చేరడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

జల వనరుల కళకళ