●పోస్టల్ బ్యాలెట్ కోరుతున్న పల్లె ఉద్యోగులు ●ఆర్డర్ కాపీ లేకపోవడంతో సాధ్యం కాదంటున్న అధికారులు ●ఉమ్మడి జిల్లాలో 1,063 మంది కార్యదర్శులు
వెయ్యి మందికి పైగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో 362 మంది రెగ్యులర్ కార్యదర్శులు, 92 మంది జేపీఎస్‌లు, 25 మంది ఓపీఎస్‌లు ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 584 మంది పంచాయతీ కార్యదర్శులకు గాను 504 మంది రెగ్యులర్, 80 జేపీఎస్‌లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరికి బీఎల్‌ఓలుగా, మరికొందరికి ఆర్‌ఓలుగా విధులు అప్పగించారు. ఈ అవకాశం కూడా తక్కువ మందికి కల్పించారు. ఇక మిగిలిన పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 29, 30వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, ఇతర సిబ్బందికి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత చేపట్టాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అంటే పోలింగ్ సందర్భంగా రెండు రోజులపాటు కార్యదర్శులంతా అక్కడే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మౌఖిక ఆదేశాలే..
సాధారణంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీలు అందజేస్తుంది. ఈ కాపీతో ఫాం 12 ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఇలా అతి తక్కువ మంది పంచాయతీ కార్యదర్శులకు ఆర్డర్ కాపీలు అందటంతో వీరు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారందరూ ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందా అని చూస్తుండగా.. ఒకవేళ కాపీ అందకపోతే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓటు వేసేది ఎలా..?
ఎన్నికల విధులు కేటాయించని గ్రామపంచాయతీ కార్యదర్శులు పోలింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు తమ గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ స్వగ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారికి ఆయా గ్రామాల్లోనే ఓటు హక్కు ఉంటుంది. పోలింగ్ రోజున పోస్టింగ్ ఉన్న గ్రామంలో విధులు నిర్వర్తిస్తే స్వస్థలంలో ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారన్నది తేలడం లేదు. ఈ విషయమై ఎన్నికల అధికారులు స్పందించి పోలింగ్ బూత్‌ల వద్ద సాధారణ విధుల్లో ఉండే గ్రామపంచాయతీ కార్యదర్శులకు పోలింగ్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారా? లేదంటే ఓటు హక్కు దూరం చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.