
బీదర్‌లో శాంతియుతంగా సద్భావన నడక
హుబ్లీ: బీదర్‌లో శాంతియుతంగా సద్భావన నడక చేపట్టారు. మహబూద్ గవాన్ మదరసా నుంచి ప్రారంభమైన ఈ నడక పలు వీధుల గుండా సాగి జిల్లాధికారి కార్యాలయానికి చేరుకొని ముగిసింది. ప్రదర్శన పొడవునా ఒక దేశం, ఒకే ధ్వని, ఒకే ఐక్యత, అన్ని మతాల సారం మానవత్వమే, ద్వేషం కాదు. ప్రేమను పంచుదాం. ప్రతి ధర్మం ఓ పువ్వులా శాంతి తోటలో కలిసి మెలసి బతుకుదాం. శాంతితో కలిసి నడుద్దాం. సౌభ్రాతృత్వమే మన శక్తి. మానవత్వం ఉన్న ఇంట్లో ద్వేషానికి స్థలం లేదు. అల్లర్లు వద్దు, హక్కులను గౌరవిద్దాం. ఐక్యత మన శక్తి, విభజన మన వినాశనం, అందరికీ సామరస్యం కావాలి తదితర నినాదాల ఫలకాలను చేతిలో పట్టుకొని ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఏడీసీ డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి, జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటిలకు వినతిపత్రాలను అందజేశారు. అంతకు వముందు జగద్గురు చెన్నబసవానంద స్వామి తదితర మఠాధీశులు మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతె సత్యాదేవి, ఫాదర్ డిసౌజ, సంజయ్, షాహిన్ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్‌తో పాటు అన్ని మతాలకు చెందిన ప్రముఖులు, సాధకులు, మత పెద్దలు పాల్గొన్నారు.