
నందికొండపై కేబినెట్‌కు ఏర్పాట్లు
చిక్కబళ్లాపురం: ఇక్కడి ప్రఖ్యాత నంది హిల్స్ మీద 2వ తేదీన సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. కొండ మీదకు మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ నవీన్‌భట్ సోమవారం నందిగిరిని పరిశీలించారు. ఏర్పాట్లను వీక్షించారు ఆయన మాట్లాడుతూ సమావేశానికి ముందు నంది ఆలయాన్ని సందర్శిస్తారు. కొండపైకి వెళ్లే మార్గంలో సూచనా ఫలకాలను అమరుస్తాం, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తరువాత కుప్పహళ్లి గ్రామ పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రిమండలి భేటీతో చిక్కతో పాటు నందిహిల్స్ పరిసరాలలో కోలాహలం నెలకొంది. పర్యాటకుల రాకను నిషేధించారు.
ఘరానా ఓఎల్‌ఎక్స్
మోసగానికి సంకెళ్లు
యశవంతపుర: ఓఎల్‌ఎక్స్‌లో కారు అమ్ముతున్నట్లు ప్రకటన ఇచ్చి డబ్బులు తీసుకుని ఉడాయించే మోసగాన్ని దక్షిణకన్నడ జిల్లా మంగళూరు సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రవిచంద్ర మంజునాథ్ రేవణకర (29)ని అరెస్ట్ చేశారు. రూ.2.5 లక్షలకు కారు అమ్ముతున్నట్లు ఓఎల్‌ఎక్స్ యాప్‌లో ఇతడు ప్రకటన ఇచ్చాడు. ఓ వ్యక్తికి ఈ డీల్ నచ్చి సంప్రదించాడు, డబ్బులు పంపగానే కారును డెలివరీ చేస్తానని మోసగాడు చెప్పాడు. సరేనని బాధితుడు డబ్బులు బదిలీ చేశాక వంచకుడు స్పందించలేదు. బాధితుడు మంగళూరు సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలించి నిందితుడు హొసపేటలో ఉండగా వెళ్లి అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. నిందితునికి 21 బ్యాంక్ ఖాతాలున్నాయి. 8 సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నాడు. ఇతని మీద 80 కి పైగా సైబర్ వంచన కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్ల నుంచి కార్ల ఫోటోలను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి మోసాలకు పాల్పడడమే వృత్తిగా చేసుకున్నాడని బయట పడింది.
తోటలోకి ఆవు వచ్చిందని..
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని హోసనగర తాలూకాలోని విజాపుర గ్రామంలో ఆవు పొదుగును కత్తిరించిన కేసులో రామచంద్ర అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌శెట్టి అనే వ్యక్తి ఆవును జూన్ 28వ తేదీన మేతకు వదిలాడు. అప్పుడు ఒక పొదుగును ఎవరో కత్తిరించారు. హోసనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగింది. నిందితుడు రామచంద్ర చాకుతో పొదుగును కోయడంతో పాటు కట్టెతో ఆవును చావబాదినట్లు ఒప్పుకున్నాడు. తన తోటలోకి వచ్చి మేసిందనే కోపంతో దాడి చేశానన్నాడు.
పేలిన బస్సు టైరు,
10 మందికి గాయాలు
మైసూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు టైరు పేలి పది మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన సోమవారం నంజనగూడు తాలూకాలోని హెడియాల దగ్గర జరిగింది. బేగూరు నుంచి హెడియాల మీదుగా సరగూరుకు వెళ్తున్న బస్సు టైరు పేలిపోయింది. ఆ తాకిడికి బస్సులోని వారికి గాయాలయ్యాయి. హెడియాల మాజీ జీపీ సభ్యుడు నేమతుల్లాఖాన్, అతని స్నేహితులు గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్లారు. హెడియాల సరిహద్దుల్లో తరచూ ఆర్టీసీ బస్సులు చెడిపోతున్నాయి. ఉచిత బస్సు కావడంతో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. రద్దీకి తగినట్లు బస్సులు నడపడం లేదు. పైగా పాత డొక్కు బస్సులు తిప్పుతున్నారని ప్రజలు ఆరోపించారు. కొత్త బస్సులను వేయాలని కోరారు.