చెత్త లారీలో మహిళ శవం | - | Sakshi
Sakshi News home page

చెత్త లారీలో మహిళ శవం

Jun 30 2025 4:21 AM | Updated on Jun 30 2025 4:21 AM

చెత్త లారీలో మహిళ శవం

చెత్త లారీలో మహిళ శవం

శివాజీనగర: బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురైంది. మహిళను హత్యచేసిన దుండగులు శవాన్ని మూటకట్టి చెత్త లారీలో ఉంచి పరారయ్యారు. చెన్నమ్మకెర అచ్చుకట్ట ప్రాంతంలో ఓ స్కేటింగ్‌ మైదానం వద్ద లారీలో శవాన్ని పడేశారు. శనివారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన దుండగులు నిలిపిన చెత్త లారీలో శవం మూట ఉంచి పరారయ్యారు. ఆదివారం ఉదయం లారీ సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించారు. మృతురాలి వయసు 30–35 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాల కోసం, అలాగే హంతకుల కోసం విచారణ సాగుతోంది.

భారీగా నకిలీ జీన్స్‌ సీజ్‌

దొడ్డబళ్లాపురం: మార్కెట్లో అనేక కంపెనీల బ్రాండెడ్‌ జీన్స్‌ ఫ్యాంట్లు, వస్త్రాలు లభిస్తుంటాయి. కానీ అవి అసలైనవా, కాదా? అనేది తెలుసుకోకుంటే నకిలీవి అంటగడతారు. నకిలీ బ్రాండెడ్‌ జీన్స్‌ తయారీ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు రూ.30 లక్షలకు పైగా విలువైన జీన్స్‌ దుస్తులను సీజ్‌ చేశారు. బెంగళూరు మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి బైలకోనేనహళ్లిలోని సదరు ఫ్యాక్టరీలో సోదాలు చేయగా, నాసినకం బట్టతో తయారు చేసిన జీన్స్‌ దుస్తులకు ప్రముఖ కంపెనీల లేబుళ్లు తగిలించి షాపులకు తరలిస్తున్నట్లు తేలింది. వాటిని అధిక ధరలకు విక్రయించేవారు. అలాగే అనుమతులు కూడా లేకుండా గోడౌన్‌లో గార్మెంట్స్‌ని నడుపుతున్నారు. కాపీరైట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఐదేళ్లూ సిద్దునే సీఎం: మంత్రి

మైసూరు: సీఎం సిద్దరామయ్య పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భద్రంగా ఉంది, ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది, ఎలాంటి సమస్యలు లేవని మంత్రి హెచ్‌.సి.మహాదేవప్ప అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు సంక్రాంతి పండుగ గురించి తెలుసు కానీ, సెప్టెంబర్‌ నెలలో వచ్చే క్రాంతి, మహాక్రాంతి గురించి వినలేదని బీజేపీ నేతల విమర్శలపై మండిపడ్డారు. రాజ్యాంగం రక్షణ కోసం క్రాంతి జరుగుతుందని అన్నారు. ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారని చెప్పారు. సీఎం కావాలని అందరికీ ఆశ ఉంటుందని, అవకాశం ఒక్కరికే వస్తుందని అన్నారు.

కావేరి హారతిపై నోటీసు: డీసీఎం

శివాజీనగర: కృష్ణరాజ సాగర జలాశయం వద్ద కావేరి హారతిని నిర్వహించడాన్ని కొందరు ప్రశ్నిస్తూ వేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్‌ జారీచేసినట్లు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌ చెప్పారు. త్వరలో సర్కారు నుంచి సమాధానం ఇస్తామన్నారు. ఆయన ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడారు. హారతికి కొందరు అభ్యంతరం చెబుతున్నారు, ఎవరి అనుమతి అవసరం లేదు అని అన్నారు. ఆగస్టులో రాష్ట్రంలో మార్పు సంభవిస్తుందని బీజేపీ నేత అశోక్‌ చెప్పడాన్ని హేళన చేశారు. అశోక్‌ జ్యోతిష్యం చెప్పటం ఆరంభించారా? నాకు సమయం ఇప్పించండి, నేను వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొంటానని చమత్కరించారు. త్వరలో పార్టీ ఇన్‌చార్జి రణదీప్‌ సుర్జేవాలా వస్తారని, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడతారని చెప్పారు.

చోరీ చేసి, షాపులకు నిప్పు

మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు పట్టణంలో దుండగులు ఓ షాపుల పై కప్పును తొలగించి లోపలికి చొరబడి దోచుకుని, నిప్పుపెట్టి పారిపోయారు. బెత్తలిమారమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డులోని రిషి స్టోర్స్‌, నంది స్టోర్స్‌ లోకి శనివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. విలువైన దుస్తులు, బూట్లు, రూ. 20 వేల డబ్బును దొంగిలించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు షాపుల నుంచి పొగలు మంటలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు యజమానులకు తెలిపారు. వారు చేరుకుని వెంటనే స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

అతనే నా బిడ్డకు తండ్రి

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుని కొడుకు కృష్ణ జె రావ్‌ తన కొడుక్కి తండ్రి అని ఓ బాలింత చెబుతోంది. అతని వల్లే తనకు మగ బిడ్డ పుట్టాడని పేర్కొంది. తన బిడ్డకు తండ్రి కృష్ణ జె రావ్‌ కారణమంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కృష్ణ తనను ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడని ఆమె తెలిపింది. ఫలితంగా గర్భం దాల్చి మగ బిడ్డ పుట్టాడని, ఇప్పుడు ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, మోసపోయానని విలపించింది. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement