
లారీ ఢీకొని ఎస్‌ఐ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: గంజాయి కేసులో నిందితులను అరెస్టు చేసి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ ఎస్సై మెహబూబ్ కన్నుమూశారు. శనివారం రాత్రి గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అత్తిబెలెలో అరెస్టు చేసి కారులో తీసుకువస్తుండగా సూర్యసిటీ వద్ద కారు టైర్ పంచర్ అయ్యింది. రోడ్డుపక్కన కారు ఆపి డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఎస్సై మెహబూబ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ మెహబూబ్‌పై దూసుకెళ్లింది. ఈ గందరగోళంలో గంజాయి నిందితులు పరారయ్యారు. గాయపడ్డ ఎస్సైని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మెహబూబ్ చికిత్స ఫలించక ఆదివారంనాడు మరణించారు.
అస్పృశ్యత వివాదం
దొడ్డబళ్లాపురం: కొన్ని గ్రామాలలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతోంది. దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించిన క్షురకునిపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా కిణిసుల్తాన గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ఒకే ఒక క్షౌ రశాల ఉంది. దళితులకు కటింగ్ చేయనని క్షురకుడు తెగేసి చెప్పిన వీడియో ప్రచారమైంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు నిందితున్ని పిలిపించి చట్టంపై అవగాహన కల్పించారు. ఇక నుంచి దళితులకు కటింగ్ చేస్తానని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.
మోదీ నోట, రొట్టెల మాట
శివాజీనగర: కలబుర్గి గట్టి జొన్న రొట్టెల గురించి తెలియనివారుండరు. జొన్న రొట్టెలు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా పేరుపొందాయన్నది తెలిసిందే. ఇక్కడ తయారయ్యే రొట్టెలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఎంతోమంది మహిళలు రొట్టెలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి కృషిని ప్రధాని మోదీ మెచ్చుకొన్నారు. ఆదివారం సాగిన మన్‌కీ బాత్‌లో మహిళా స్వావలంబన భారతదేశ అభివృద్ధికి కొత్త మంత్రమైంది. కలబుర్గి మహిళలు జొన్న రొట్టెల తయారీ ద్వారా ఆత్మనిర్భరతకు బ్రాండ్‌గా నిలిచారు అని ప్రశంసించారు. స్వసహాయ సంఘాల ద్వారా ప్రతిరోజు 3 వేల రొట్టెలు తయారు చేస్తున్నారు. ఈ రొట్టెలు గ్రామాలకే కాకుండా నగరాల్లో, ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు అని కొనియాడారు.
జలపాతం నుంచి పడి టూరిస్టు మృతి
దొడ్డబళ్లాపురం: బెళగావి– మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంబోలి జలపాతం వద్ద విషాదం జరిగింది. 300 అడుగుల ఎత్తు నుండి కిందపడి పర్యాటకుడు మరణించాడు. కొల్హాపుర నివాసి బాలసో సాగర్ (45) మృతుడు. ఆదివాంనాడు అంబోలి ఫాల్స్ చూడడానికి స్నేహితులతో వచ్చాడు. ఫాల్స్‌ను దగ్గరగా చూస్తుండగా జారి 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడే మరణించాడు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు.
రన్యకు జైల్లో వేధింపులు
బనశంకరి: బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటి రన్య రావు ఇబ్బందుల్లో ఉంది. జైలు భోజనం ఆమెకు సరిపడలేదు. ఆ వాతావరణం, అక్కడ సిబ్బంది ప్రవర్తనతో సమస్యలు ఎదుర్కొంటోంది. మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నట్లు, బంగారు దొంగ అని సతాయిస్తున్నట్లు బంధువులకు తెలిపింది. ఇది తట్టుకోలేని ఆమె మరో బ్యారక్‌లోకి మార్చాలని జైలు అధికారులను కోరింది. అందుకు వారు అంగీకరించారని, త్వరలోనే మార్చవచ్చని సమాచారం.
వెల్డింగ్ కార్మికుడు దుర్మరణం
మైసూరు: నగరంలోని బివిఎల్ లేఔట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు చనిపోయాడు. మైసూరు అజీజ్ నగర నివాసి సుహేల్ (25)గా గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి సుహేల్ మరణించాడు భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని మృతుని భార్య ఫిర్యాదు చేసింది. భవన యజమాని ప్రదీప్, ఇంజనీర్ అనిల్‌పై ఆలనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

లారీ ఢీకొని ఎస్‌ఐ దుర్మరణం

లారీ ఢీకొని ఎస్‌ఐ దుర్మరణం