
కాస్మొటిక్స్‌లో హాని కారకాలు?
బనశంకరి: నేటి రోజుల్లో కాస్మొటిక్స్ అనబడే సౌందర్య ఉత్పత్తులు జీవితంలో ఓ భాగమయ్యాయి. పేద, ధనిక, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ స్థాయికొద్దీ వాటిని వాడుతున్నారు. అందంగా కనిపించాలనే ఆరాటమే కారణం. కానీ కాస్మొటిక్స్ ఆరోగ్యానికి హానికరమే అభిప్రాయాలున్నాయి. స్టెరాయిడ్స్‌ను కలిపిన క్రీమ్స్, ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిపై రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నిఘాపెట్టింది. మగువలు నిత్యం వాడే క్రీమ్స్, లిప్‌స్టిక్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌందర్య ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌లలో పరీక్షించాలని నిర్ణయించారు. ముఖం అందంకోసం వాడే ఫోలిక్ యాసిడ్, స్టెరాయిడ్ బేస్‌క్రీమ్, విటమిన్ డీ, సి కలిగిన క్రీమ్‌లు, సీరమ్‌లలో నాణ్యత లోపించిందని ఆ సంస్థ తనిఖీలలో రుజువైంది. అనేకమంది ప్రజలు ముఖం కాంతిని పెంచుకోవడానికి ఈ మూలకాలు కలిపిన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలు నాసిరకం మూలకాలను కలిపి తయారు చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను చేపట్టింది. ఈ సంస్థ గతంలో అనేక బొంబై మిఠాయి, పానీ పూరి, పన్నీర్, స్వీట్లు వంటి ఆహార ఉత్పత్తులను తనిఖీ చేసి క్యాన్సర్ రోగ కారకాలు వాడుతున్నారని హెచ్చరించడం తెలిసిందే.
ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు