
హాసన్‌లో ఆగని గుండెపోటు మరణాలు
యశవంతపుర: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం గుండెపోటుతో మరో వ్యక్తి చనిపోయాడు. హాసన్ నగరంలోని సిద్ధేశ్వరనగరకు చెందిన గోవింద (37) ఆటో డ్రైవర్. ఆటో నడుపుతుండగా ఒక్కసారిగా ఎదలో నొప్పి వచ్చింది, ఆటోలోనే జిల్లా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందికి తన బాధ చెబుతూ ఉన్నాడు, అంతలోనే కుప్పకూలిపోయాడు. పరిశీలించిన వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. ఈ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గుండెపోటు వచ్చి 17 మంది మరణించడం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు ఇలా ఆకస్మికంగా మరణిస్తున్నారో, గుండెపోటుకు కారణాలేమిటో అని చర్చ సాగుతోంది.
బస్ కండక్టర్ గిరీశ్..
యశవంతపుర: హాసన్ జిల్లాకు చెందిన బెంగళూరు బీఎంటీసీ కండక్టర్ గిరీశ్ (41) గుండెపోటుతో మరణించారు. శనివారం సెలవు కావటంతో సొంతూరు హాసన్ తాలూకా కట్టాయి హొబళి హ్యరానె గ్రామానికి వెళ్లారు. పొలానికి వెళ్లి మొక్కజొన్న పంటకు ఎరువులు వేసి ఇంటికి వచ్చారు. ఎదలో నొప్పిగా ఉందని అక్కడే పడిపోయారు. కుటుంబసభ్యులు చూసేసరికి విగతజీవి అయ్యాడు. గిరీశ్‌కు ప్రతి వారం సెలవు రోజున ఊరికెళ్లి పొలం చూసుకోవడం అలవాటు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.