
అనుచిత వ్యాఖ్యలపై నిరసన
రాయచూరు రూరల్: భూములను ముస్లింలకు కట్టబెట్టే రెవెన్యూ అధికారులను ఉరి తీస్తామని చెప్పిన శ్రీరంగపట్టణ ఎమ్మెల్యే రమేష్ బండిసిద్దేగౌడను పార్టీ నుంచి తొలగించాలనీ ఎస్‌డీపీఐ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉపాధ్యక్షుడు మతీన్ అన్సారీ మాట్లాడారు. దేశంలో శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి గందరగోళం సృష్టించడం తగదన్నారు. ఎమ్మెల్యేను శాసన సభ్యుడి స్థానం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అక్బర్, తౌసిఫ్ అహ్మద్, ఇర్ఫాన్, హఫీజ్, ముస్తాక్, మీర్జా హుసేన్ బేగ్‌లున్నారు.
అక్రమ మద్యం రవాణా అరికట్టండి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలో అక్రమంగా సరఫరా అవుతున్న మద్యం రవాణాకు కళ్లెం వేయాలని దళిత సంఘర్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి బసవేశ్వర సర్కిల్ వద్ద ఉపాధ్యక్షుడు రవీంద్ర గుత్తేదార్ మాట్లాడారు. జిల్లాలోని జేవర్గి, యడ్రామి తాలూకాల్లో వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందన్నారు. దీనిని నియంత్రించడంలో ఎకై ్సజ్ అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు దాఖలాలు చూపించిన అధికారులు తప్పుడు కేసులను బనాయించి దారి తప్పిస్తున్నారన్నారు.
రైలు ఎక్కుతుండగా వ్యానిటీ బ్యాగ్ చోరీ
హుబ్లీ: హుబ్లీలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం–3లో వచ్చిన విశ్వ మానవ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కేటప్పుడు బంగారు ఆభరణాలతో ఉన్న సుమారు రూ.4.06 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్న మహిళ వ్యానిటీ బ్యాగ్ చోరీ చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. గదగ్ జిల్లా సిద్దలింగనగర్ అన్నపూర్ణ అదరకట్టి అనే మహిళ బ్యాగ్ చోరీకి గురైంది. హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైల్లో గదగ్ నుంచి హుబ్లీకి వచ్చి దిగిన ఆమె బెంగళూరు వెళ్లడానికి విశ్వమానవ రైలు ఎక్కుతుండగా దొంగ చేతి వాటం చూపారు. ఫలితంగా రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు తాళి, రూ.40 వేల విలువ చేసే చెవి దుద్దులు, మొబైల్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు మహిళ హుబ్లీ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బుద్ధిమాటలు చెప్పినందుకు..
కాగా మరో ఘటనలో బుద్ధి మాటలు చెప్పినందుకు అన్నను చాకుతో తమ్ముడు పొడిచిన ఘటన నవనగర్‌లోని నందీశ్వర నగర్ లేఅవుట్‌లో మంగళవారం చోటు చేసుకుంది. తౌఫిక్ ఇదిళిగార తమ్ముడి చేతిలో కత్తిపోట్లకు గురైన అన్న. బాధితుడిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ముస్తాక్ ఇదిళిగారను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి పట్ల బాధ్యతగా ఉండాలని అన్న తౌఫిక్ మంచి మాటలు చెబుతున్న వేళ కోపగించుకున్న తమ్ముడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపిన నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లో భారీగా గుట్కా
క్రిష్ణగిరి: నిషేధిత గుట్కా ఉత్పత్తులను భారీ మొత్తంలో ఇంట్లో దాచి అమ్ముతున్న వ్యక్తిని ఊత్తంగేరి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లూరు గ్రామానికి చెందిన కుమార్ (32) ఇంట్లో ఎస్‌ఐ జయగణేష్, పోలీసులు సోదాలు చేయగా 130 కిలోల గుట్కా పట్టుబడింది. సీజ్ చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.

అనుచిత వ్యాఖ్యలపై నిరసన