
నిప్పుల కొలిమిగా ఉత్తర కర్ణాటక
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారిగా పేరొందిన బళ్లారి జిల్లాతోపాటు కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, విజయనగర, కొప్పళ, గదగ్, బాగల్‌కోటె, విజయపుర, బెళగావి తదితర జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకు ఎండలు తీవ్రం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ముందుగానే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ జోరుగా వర్షాలు కూడా కురిశాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి, జొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల నేలతల్లి చల్లబడుతుందని జనం సంతోషిస్తున్న తరణంలో ఓ వైపు పంట నష్టం మరో వైపు ఎండల తీవ్రత కూడా పెరిగిపోతోంది. అత్యధికంగా కలబుర్గి జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఎండలు దాటడంతో ఎండవేడిమికి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.
చల్లని పానీయాలు, పండ్లకు గిరాకీ
మధ్యాహ్నం వేళలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు చల్లని పానీయాలతో కొంత సేదరుతున్నా అవి కాసేపు మాత్రమే హాయిని ఇస్తున్నాయి. యాదగిరి జిల్లాలో 44 డిగ్రీలు, బళ్లారిలో 40 డిగ్రీలు, బాగల్‌కోటెలో 40 డిగ్రీలు, విజయపురలో 42 డిగ్రీలు ఇలా ఉత్తర, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల పరిధిలోని జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎండలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కలబుర్గిలో విపరీతమైన ఎండలు పెరిగిపోవడంతో రోడ్లలో జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండలు పెరిగిపోవడం ఓ వైపు, అప్రకటిత విద్యుత్ కోత వల్ల ఇళ్లలో ఉండేందుకు ఫ్యాన్లు తిరగనందుకు ఉక్కపోతతో జనం పడుతున్న అవస్థలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఉక్కపోత పెరిగి పోవడం వల్ల ఇన్వర్టర్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
కలబుర్గిలో 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న ఉష్ణోగ్రతలు
బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఎండ ప్రచండం

నిప్పుల కొలిమిగా ఉత్తర కర్ణాటక

నిప్పుల కొలిమిగా ఉత్తర కర్ణాటక