పత్తి రైతుల ‘యాప్’సోపాలు
కొనుగోళ్లపై పరేషాన్ కపాస్ కిసాన్ యాప్‌లో కనిపించని 12 క్వింటాళ్ల పరిమితి అందని మద్దతు ధర విక్రయానికి ఇదేం దుస్థితి..?
కరీంనగర్ అర్బన్: రైతులు పత్తి విక్రయించాలంటే ముప్పుతిప్పలు పడుతున్నారు. అక్టోబరు నుంచి భారత పత్తి సంస్థ(సీసీఐ) మద్దతు ధర క్వింటాకు రూ.8,110 చెల్లించింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ నవంబరు 2నుంచి 7 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేయాలని పరిమితి విధించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఆర్థిక గణాంకాలశాఖ నివేదిక ఆధారంగా పత్తి దిగుబడులు ఎకరానికి 7 క్వింటాళ్లు మించవని నిర్ధారించింది. ఈ మేరకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌లోనూ 7క్వింటాళ్ల పరిమితి నిబంధనలు పెట్టగా.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళిశాఖతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో వాస్తవసాగుపై కలెక్టర్లతో సర్వే నిర్వహించి.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడి ఎకరానికి 11.77 క్వింటాళ్లు తేలింది. జిల్లాలో మొత్తం 47వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలోని 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుండగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది స్వల్పమే. ప్రైవేట్‌కే కొమ్ముకాస్తుందన్న విమర్శలు కొకొల్లలు.
ఏఈవో ధ్రువీకరణతోనే విక్రయాలు
ఎకరానికి 12క్వింటాళ్ల వరకు సీసీఐకి పత్తిని విక్రయించాలంటే ప్రస్తుతం రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. రైతులు పండించిన పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏఈవోలు తమకు కేటాయించిన పోర్టల్లో దిగుబడి వివరాలు నమోదు చేయాలి. తద్వారా రైతుల వివరాలకు సంబంధించి శ్రీఈల్డింగ్ సర్టిఫికేట్‌శ్రీ మొబైల్ ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో సీసీఐ కేంద్రానికి వెళ్తుంది. ఏఈవోల ద్వారా ధ్రువీకరణ పొందిన రైతులు మాత్రమే ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు విక్రయించుకునే అవకాశం కల్పించారు.
మార్పుల్లేని యాప్
కపాస్ కిసాన్ యాప్‌లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎకరానికి 7క్వింటాళ్ల పరిమితే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళిశాఖకు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇంకా యాప్‌లో సీసీఐ మార్పులేవి చేయలేదు. యాప్‌లో ఎకరానికి 12 క్వింటాళ్ల పరిమితి ఒకటిరెండు రోజుల్లో అప్డేట్ అవుతుందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఏఈవో ధ్రువీకరణతో మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించాయి.
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన నారాయణరెడ్డి పత్తి విక్రయించాలని స్లాట్ బుక్ చేస్తే కావడం లేదు. ఇప్పటికే ఏడు క్వింటాళ్లు విక్రయించగా కేంద్రం ఎకరానికి 12క్వింటాళ్ల వరకు పరిమితి పెంచినప్పటికీ యాప్‌లో పాత విధానమే అనుసరిస్తోంది. ఇది ఒక
నారాయణరెడ్డి పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా రైతుల దుస్థితి.


