బల్దియా స్పెషల్ డ్రైవ్
సెల్లార్.. 80శాతం ఉల్లంఘనే
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో బల్దియా స్పెషల్ డ్రైవ్ సీజన్ నడుస్తోంది. ఏళ్లుగా కూనరిల్లిన వివిధశాఖలకు పూర్తిస్థాయిలో ఊపిరిలూదేందుకు కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఫోకస్ పెట్టారు. సేవలను మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఆయా విభాగాల అధికారులతో డివిజన్లవారీగా సర్వే చేయిస్తున్నారు. నల్లాలు, ఆస్తి పన్ను, సెల్లార్ పార్కింగ్, విద్యుత్ మీటర్లపై చేపట్టిన సర్వేలు ఫలితాలిస్తున్నాయి.
రెసిడెన్షియల్ టు కమర్షియల్
నగరపాలకసంస్థ ఆదాయ వనరుల్లో ప్రధానమైన ఆస్తి పన్నులపైఽ అధికారులు దృష్టిపెట్టారు. రెసిడెన్సి పేరిట అనుమతి పొంది కమర్షియల్‌కు వినియోగిస్తున్న భవనాలు పెద్దఎత్తున కమర్షియల్ ట్యాక్స్ ఎగవేస్తుండడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నగరవ్యాప్తంగా 242 కమర్షియల్, 1,033 మిక్సింగ్ భవనాలు ఉన్నట్లు లెక్కతేల్చారు. 883 భవనాలు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని, రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆస్తి పన్ను ఆదాయ డిమాండ్‌ను రూ.1,98,56,000కు బల్దియా పెంచుకుంది.
నల్లాలు.. ఆన్‌లైన్ ఇక్కట్లు
అక్రమ కనెక్షన్లు, మెయిన్‌పైప్‌లైన్ కనెక్షన్లు, రెసిడెన్షియల్ పేరిట కమర్షియల్ కనెక్షన్లు, ఆన్‌లైన్ సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న నల్లాల విభాగంలో స్పెషల్ డ్రైవ్‌తో కాస్త కదలిక వచ్చింది. నెల రోజులుగా చేపట్టిన సర్వేతో రూ.30లక్షల ఆదాయం సమకూరింది. మరో 20వేల నల్లా కనెక్షన్లు సర్వే చేయాల్సి ఉంది. నల్లాల సర్వేలో పెద్ద ఎత్తున సమస్యలు బయటపడుతున్నాయి. క్రమం తప్పకుండా నల్లా బిల్లులు చెల్లిస్తున్నా, తాము బకాయి పడ్డట్టు నోటీసులు ఇచ్చారంటూ వినియోగదారులు బల్దియా ఉద్యోగులతో వాదనకు దిగుతున్నారు. బిల్లులు చెల్లించినా, గతంలో ఆన్‌లైన్ చేయకపోవడంతో బిల్లు బకాయిలుగానే ఆన్‌లైన్‌లో చూపుతోందని సిబ్బంది నోటీసులిస్తున్నారు.
విద్యుత్ మీటర్లపై
వీధి దీపాలు, ఇతరత్రా వ్యవహారాలకు వినియోగించే విద్యుత్ మీటర్లపై సర్వే చేపట్టారు. కనెక్షన్‌లు, వాడకానికి మించి విద్యుత్ బిల్లులు వస్తుండడం, చాలా చోట్ల మీటర్ల సమస్యలు, కొన్ని చోట్ల నగరపాలకసంస్థ విద్యుత్ మీటర్ల నుంచి కొంతమంది వ్యక్తిగత అవసరాలకు కనెక్షన్ తీసుకోవడం లాంటి వ్యవహరాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థ చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ సత్పలితాలను ఇస్తున్నా, భవిష్యత్‌లోనూ కొనసాగిస్తేనే లక్ష్యం నెరవేరే అవకాశముంది.
భవన సెల్లార్లను పార్కింగ్‌కు బదులుగా, వ్యా పార, వాణిజ్య అవసరాలు వినియోగించడంపై పట్టణ ప్రణాళికాధికారులు సర్వే చేపట్టారు. దాదాపు 80 శాతం భవనాలు సెల్లార్ నిబంధనలు ఉల్లంఘించి నట్లు తేలింది. ఇప్పటివరకు 149 భవనాల్లోని సెల్లార్లను తనిఖీ చేశారు. అందులో 102 భవనాలు సెల్లార్‌ను పార్కింగ్‌కు బదులు, ఇతరత్రా అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.


