
14 నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఉంటుందని శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులకు సామర్లకోట ఈటీసీలోనే శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈటీసీ సిబ్బంది ఆయా జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు మంగళవారం శిక్షణ ప్రారంభించినట్టు వివరించారు. కోర్సు డైరెక్టర్‌గా కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు వి.జగన్నాథం, ఖాజా మొహీద్దీన్ శిక్షణ ఇస్తారన్నారు. రెండో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రాంగణంలో, ఎనిమిదో తేదీ నుంచి విశాఖపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్‌లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పీ మీటింగ్ హాల్‌లో శిక్షణ ఉంటుందన్నారు.
నెల రోజులు సెక్షన్–30 అమలు
అమలాపురం టౌన్: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్‌లో నెల రోజుల పాటు సెక్షన్–30 అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ నెల 31 వరకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెప్పారు. ఈ నేప థ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలు జరపడానికి ముందుగా తన అనుమతి పొందాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.