
రత్నగిరి.. భక్తఝరి
సత్యదేవుని దర్శనానికి బారులు తీరిన భక్తులు
● తొలి ఏకాదశి పర్వదినాన పోటెత్తిన భక్తులు
● సత్యదేవుని దర్శించిన 75 వేల మంది
● దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం
అన్నవరం: తొలి ఏకాదశి పర్వదినం, ఆదివారం సెలవు దినం కలసి రావడంతో రత్నగిరి భక్తజన సంద్రమే అయ్యింది. గత మూడు నెలల్లో ఏ రోజూ కూడా రాని స్థాయిలో భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుని దర్శనానికి శనివారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. రాత్రికే సుమారు 30 వేల మంది రాగా, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తజన ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
రద్దీని తట్టుకునేందుకు గాను అంతరాలయ దర్శనం నిలిపివేశారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. సుమారు 75 వేల మంది స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. ఐదు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఘనంగా రథసేవ
రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుని రథసేవ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రయాగ రాంబాబు తదితరులు పూజలు చేశారు. అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో నిర్వహించిన ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ప్రసాదం అమ్మకాలు అదుర్స్
ఆషాఢ మాసం రెండో ఆదివారం నాడు సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్లను రికార్డు స్థాయిలో విక్రయించారు. తుని సమీపంలోని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో కొండ దిగువన తొలి పావంచా వద్ద, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద రద్దీ ఏర్పడింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా వచ్చిన భక్తులు కూడా సత్యదేవుని ప్రసాదాలు భారీగా కొనుగోలు చేశారు. దీంతో, రత్నగిరిపై కూడా స్వామివారి ప్రసాదాలకు డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 1.20 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా దేవస్థానానికి రూ.24 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

రత్నగిరి.. భక్తఝరి

రత్నగిరి.. భక్తఝరి