
ఈ వారంలోనే ‘ప్రసాద్’ టెండర్ల ఖరారు
● నెలాఖరు నుంచి పనులు
ప్రారంభమయ్యేలా చర్యలు
● టూరిజం శాఖ ఈఈ ఈశ్వరయ్య
రత్నగిరిపై పరిశీలన
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్నంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము టెండర్లను ఈ వారంలో ఖరారు చేస్తామని పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య తెలిపారు. దేవస్థానంలో ప్రసాద్ స్కీము నిర్మాణాలు చేపట్టే ప్రదేశాలను పర్యాటక శాఖ అధికారులతో కలసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద రూ.18.98 కోట్లతో చేపట్టే వివిధ పనులకు గత మే నెలలో టెండర్లు పిలిచామని, తమ శాఖ ఉన్నతాధికారులు సెలవులో ఉన్నందువల్లనే వీటి ఖరారు వాయిదా పడింది తప్ప మరే ఇతర కారణమూ లేదని వివరించారు. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.11.09 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం నిర్మించే పాత టీటీడీ భవనం స్థలం, ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.9 కోట్లతో నిర్మించనున్న క్యూ కాంప్లెక్స్ స్థలం, ప్రకాష్ సదన్ భవనం వెనుకన ప్రస్తుతం పార్కింగ్‌కు వాడుతున్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా రూ.61.78 లక్షలతో నిర్మించనున్న టాయిలెట్స్ బ్లాక్‌ల స్థలం, రూ.1.08 కోట్లతో ఏర్పాటు చేయనున్న వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో చేపట్టనున్న భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. వీటితో పాటు ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని సత్రాల నుంచి స్వామివారి ఆలయం, వ్రత మండపాల మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగిస్తారు. ప్రసాద్ నిర్మాణ స్థలాల పరిశీలన అనంతరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య సమావేశమయ్యారు. ఆయన వెంట టూరిజం శాఖ డీఈ సత్యనారాయణ తదితరులున్నారు.
మూడోసారి టెండర్లు
ప్రసాద్ స్కీము నిర్మాణాలకు గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి టెండర్లు పిలిచి రద్దు చేశారు. రెండోసారి గత జనవరిలో రూ.18.98 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. దీనిని 16 శాతం తక్కువకు విశాఖపట్నానికి చెందిన అనంతరాములు అండ్ కో దక్కించుకుంది. అయితే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ ఏప్రిల్ 30న కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్, ఇక్కడ ప్రసాద్ కాంట్రాక్టర్ ఒక్కరే కావడంతో ఆయనను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దీంతో, ప్రసాద్ నిర్మాణాలకు మే 15న తిరిగి మూడోసారి షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీ మే నెల 24 కాగా, అప్పటి నుంచీ టెండర్లు ఖరారు చేయలేదు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు టెండర్ దక్కే అవకాశం లేకపోవడమే దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.