
లోవకు పోటెత్తిన భక్తులు
● భక్త జనసంద్రమైన దేవస్థానం
● తలుపులమ్మ తల్లిని దర్శించిన 33 వేల మంది
● తొలి ఏకాదశి సందర్భంగా
అమ్మవారికి లక్ష తులసి పూజ
తుని: ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఏకాదశి పర్వ దినం కావడంతో లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తు లు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 33 వేల మంది తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు పండితులు లక్ష తులసి పూజ నిర్వహించారు. పంచలోహ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ పూజను భక్తులు తిలకించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,12,930, పూజా టికెట్లకు రూ.3,07,630, కేశఖండన టికెట్లకు రూ.22,440, వాహన పూజ టికెట్లకు రూ.6,560, కాటేజీలకు రూ.86,722, విరాళాలు రూ.1,19,911 కలిపి దేవస్థానానికి మొత్తం రూ.8,50,543 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి డ్రోన్‌తో ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న తలుపులమ్మ అమ్మవారికి 3 టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

లోవకు పోటెత్తిన భక్తులు