
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కాళేశ్వరం: యువత గంజాయి, మట్కా, తంబాకు లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను సీఐ రామచందర్‌రావుతో కలిసి సందర్శించారు. పోలీసుస్టేషన్ పనితీరు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద బార్డర్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. వాహన ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశారు. కాళేశ్వరంలోని వీఐపీ, మెయిన్ ఘాటులను సందర్శించి, గోదావరి వరద ఉధృతిని సమీక్షించారు. వర్షాకాలంలో గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించి గోదావరి ప్రవాహంతో నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కాళేశ్వరం గ్రామ యువకులతో సమావేశమై యువత అన్ని రంగాల్లో ముందుండాలని, ఉన్నత చదువులను చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఆకర్షితులు కావొద్దని చెప్పారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీ సూర్యనారాయణ