
మేడిగడ్డ వద్ద నిలకడగా వరద ఉధృతి
కాళేశ్వరం: మహారాష్ట్ర గుండా ప్రాణహితనది వరద తరలిరావడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవాహ ఉధృతి కొనసాగుతుంది. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉదయం 85వేల క్యూసెక్కులు తరలిపోగా సాయంత్రం 75,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా మొత్తం 85గేట్ల నుంచి వరద తరలిపోతుంది. మహారాష్ట్రలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం వరద ఉధృతి నిలకడగా ప్రవహిస్తుంది.
ముగిసిన ఈఏపీసెట్
ధ్రువపత్రాల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈఏపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసినట్లు ఈఏపీసెట్ కన్వీనర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు తెలిపారు. నాలుగు రోజుల పాటు 864మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు తమ మొబైల్‌కి వచ్చే లాగిన్ ఐడీతో మీసేవా సెంటర్, ఆన్‌లైన్ సెంటర్‌లో లాగిన్ అయిన తరువాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించారు. ఈ ధ్రువపత్రాల పరిశీలనలో శ్రీధర్, దేవేందర్, శ్రీధర్, శ్రీనివాస్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల విధులపై
అవగాహన కలిగి ఉండాలి
భూపాలపల్లి అర్బన్: ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై బూత్ లెవల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని భూపాలపల్ల ఆర్డీఓ రవి తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మండల బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించగా ఆర్డీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓట్ల నమోదు కోసం, తొలగింపు, బదిలీ, మార్పు, చేర్పులకు సంబంధించి వినియోగించే ఫారాలపై బీఎల్‌ఓలకు అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చే నూతన మార్పులను తెలుసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ట్రైనర్లు అవగాహన కల్పించారు.
బస్సులు జాగ్రత్తగా నడపాలి
భూపాలపల్లి అర్బన్: వర్షాకాలంలో ఆర్టీసీ బస్సులను జాగ్రత్తలు పాటిస్తూ నడపాలని ఆర్టీసీ డీపో మేనేజర్ ఇందూ తెలిపారు. శుక్రవారం డిపో ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించి డ్రైవర్లతో మాట్లాడారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కోరారు. బీఎస్–6 వాహనాలలో కిలోమీటర్ లీటర్ (కేఎంపీఎల్) మెరుగుపర్చాలని సూచించారు. గడిచిన జూన్ మాసంలో ఆయిల్‌ను ఆదాచేసిన డ్రైవర్లు వెంకటేశ్వర్లు, మధులను అభినందించారు.
చేపల వేటపై నిషేధం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని గోదావరి నది, ప్రధాన చెరువుల్లో చేపలు పట్టడం నిషేధమని జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో చేపలు ప్రత్యుత్పత్తి జరుగుతున్న సమయంలో చేపలు పట్టుటను ప్రభుత్వం నిషేధించినట్లు తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

మేడిగడ్డ వద్ద నిలకడగా వరద ఉధృతి

మేడిగడ్డ వద్ద నిలకడగా వరద ఉధృతి