
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: జిల్లాలో వరదల నేపథ్యంలో ప్రజలకు ప్రాణహాని జరగకుండా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వరద సహాయక చర్యలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యా, అగ్నిమాపక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ మండలానికి ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల పటిష్టతను పరిశీలించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, చెరువు కట్టల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. 2022–23 వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్లు మరింత ఫోకస్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయని, కానీ ఇప్పటివరకు 1600 నోటీసులు జారీచేశారని వేగం పెంచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రోశయ్య సేవలు మరువలేనివి..
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా యువజన క్రీడలు శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య..
సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని కొమురయ్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.