
ప్రయోగం.. శూన్యం
జిల్లాలోని పాఠశాలల వివరాలు..
ప్రాథమిక పాఠశాలలు 317
ప్రాథమికోన్నత పాఠశాలలు 44
ఉన్నత పాఠశాలలు 69
విద్యార్థుల సంఖ్య 19,788
కాటారం: అంతంత మాత్రంగానే నిధుల విడుదల.. ప్రయోగ పరికరాలు పూర్తిగా లేకపోవడంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ విద్య అందడం లేదు. మౌలిక బోధనలతోనే పాఠాలు చెప్పి మమా అనిపిస్తున్నారు. దీంతో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అవగాహన లేకుండా పోతుంది.
పాఠ్యాంశాలపై మక్కువ పెంచడానికి..
ప్రాథమిక విద్య స్థాయి నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతో పాటు సులభంగా అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా తయారుచేసి వాటిని పిల్లలతో చెప్పించేవారు. ఇలా చేయడంతో పిల్లలకు ఎంతవరకు పాఠ్యాంశం అర్థమైందని తెలుసుకోవడానికి వీలుంటుంది.
ప్రయోగాలు కీలకం..
ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్ట్‌లో ఎక్కువభాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఇచ్చారు. వాటిని ప్రయోగం చేసి చూపితే గానీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు విన్నవించగా అనుమతించారు. అప్పట్లో అరకొర నిధుల మంజూరుతో పూర్తిస్థాయిలో పరికరాల కొనుగోలు సాధ్యపడలేదు. నిధులకు అనుగుణంగా కొనుగోలు చేసిన కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవి సైతం మూలన పడ్డాయి.
ఐదేళ్లుగా నిధులు లేవు..
2019 సంవత్సరంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా ప్రతీ ఉన్నత పాఠశాలకు రూ.50వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు సర్వశిక్షా అభియాన్ ద్వారా రూ.22 వేల నిధులను విడుదల చేశారు. వీటి ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్ల క్రితం కొన్ని ప్రయోగ పరికరాలు కొనుగోలు చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ పథకం అమలు నిలిచిపోవడంతో నిధులు మంజూరు కావడం లేదు. దీంతో పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన నిర్వహణ కష్టతరంగా మారింది. అందుబాటులో ఉన్న కొన్ని పరికరాలతో పాటు కాలంచెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు ప్రయోగాలను నామమాత్రంగా వివరిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
అవగాహన లేక పోటీలకు దూరం..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్‌కు సంబంధించిన పోటీలకు దూరంగా ఉంటున్నారు. ప్రతీ ఏడాది ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్ అవార్డుల కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనకబడిపోతున్నారు. పాఠశాలల్లో ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో కనీసం జిల్లా స్థాయిలో సైతం ప్రతిభ కనబర్చే సత్తా విద్యార్థుల్లో లేకుండా పోతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చడంతో పాటు బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
త్వరలో సైన్స్ పరికరాల పంపిణీ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ప్రయోగాత్మకంగా విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. పలు పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొరత ఉంది, మరికొన్ని పాఠశాలల్లో పాత పరికరాలతో విద్యార్థులకు ప్రయోగాలు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సైన్స్ పరికరాలు ప్రభుత్వం ద్వారా జిల్లాకు మంజూరయ్యాయి. త్వరలోనే వాటిని పాఠశాలలకు పంపిణీ చేస్తాం.
– రాజేందర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి
సర్కారు బడుల్లో అందని సైన్స్ విద్య
కానరాని ప్రయోగశాలలు, పరికరాలు
నిధుల కొరతతో పాత పరికరాలతోనే కాలం వెల్లదీత
ఐదేళ్లుగా నిలిచిన నిధుల మంజూరు
సాంకేతిక విద్యకు దూరంగా విద్యార్థులు

ప్రయోగం.. శూన్యం