
పుష్కరాల నిధులు ఏమయ్యాయి..?
కాళేశ్వరం: సర్వసతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి పనులన్నీ అసంపూర్తిగా ఉండి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. అసలు ప్రభుత్వం మంజూరు చేసి న నిధులు ఏమైయ్యాయో తెలిపాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు సామాన్య భక్తుల కోసం పుష్కరఘాట్ల వద్ద భక్తులకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. వీఐపీ ఘాట్‌లో మాత్రం సౌకర్యవంతమైన డ్రెస్సింగ్ రూమ్‌లు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎండాకాలం నేపథ్యంలో భక్తులు కొంతసేపు సేదదీరడానికి టెంట్లు కూడా వేయలేదని చెప్పారు. కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాంట్రాక్టులు ఇచ్చి అరకొరగా పనులు చేయించారని, నిధులు ఫుల్, పనులు మాత్రం నిల్ అన్న చందంగా పుష్కరాల్లో పనులు కనిపిస్తున్నాయన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, కాళేశ్వరం ఈఓలను కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రుపట్ల కీర్తిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రాంశెట్టి మనోజ్, పగే రంజిత్, పూర్ణచందర్, శ్రీకాంత్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.