
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్‌కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్‌రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
రామడుగు: దేశరాజ్‌పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ