
ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) కేవలం రెండు నెలల్లో రూ. 1,240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తరువాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.
ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితం అయ్యాయన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఓవర్‌ఫ్లైయింగ్ ఛార్జీల నుంచి పీఏఏ ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత విమానాలకు తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పాక్ పొడిగించింది.