భూమికి రక్షణ.. ‘గురు’తర బాధ్యతే..

NASA Launches Lucy Mission To Study Ancient Trojan Asteroids - Sakshi

సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొన్న ఓ ఆస్టరాయిడ్‌.. డైనోసార్లు సహా 90 శాతం జీవాన్ని తుడిచిపెట్టేసింది. అలాంటి ఆస్టరాయిడ్లు ఎన్నో భూమివైపు దూసుకొస్తూనే ఉంటాయి. కానీ గురుగ్రహం వాటిని మధ్యలోనే పట్టేసుకుని.. భూమిని కాపాడుతోంది. అలా గురుగ్రహం పట్టేసుకున్న ‘ట్రోజాన్‌ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసమే నాసా తాజాగా ‘ల్యూసీ’ వ్యోమనౌకను ప్రయోగించింది. సూర్యుడు, గ్రహాల పుట్టుక నుంచి భూమ్మీద జీవానికి మూలం దాకా.. ఎన్నో రహస్యాలను వాటి నుంచి తెలుసుకోవచ్చని చెబుతోంది. మరి ఆ ఆస్టరాయిడ్లు ఏంటి, గురుగ్రహం పట్టేసుకోవడం, భూమిని కాపాడుతుండటం ఏమిటో తెలుసుకుందామా?

సైజు, బలం పెద్దవే.. 
మన సౌర కుటుంబంలో అతిపెద్దది గురుగ్రహం. ఇంచుమించు 1,300 భూగ్రహాలను కలిపితే.. గురుగ్రహం అవుతుంది. అంత పెద్ద గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే తనకు దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్లు, తోక చుక్కలను ఆకర్షించేస్తుంది. అందులో కాస్త పెద్దవి, దూరం నుంచి వెళ్తున్నవి అయితే వాటి కక్ష్యలను మార్చేసుకుని గురుగ్రహం ఆకర్షణకు లోబడి తిరుగుతుంటాయి. మిగతావన్నీ వెళ్లి ఆ గ్రహాన్ని ఢీకొని దానిలో కలిసిపోతాయి. ఈ క్రమంలోనే సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను గురుగ్రహం మధ్యలోనే అటకాయిస్తుంది.

ఎక్కడివీ ఆస్టరాయిడ్లు.. 
సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో పదార్థమంతా అక్కడక్కడా గుమిగూడి గ్రహాలుగా ఏర్పడింది. అలా ఆకర్షణకు లోనుకాని శకలాలు, తోకచుక్కలు వంటివి అలాగే మిగిలిపోయాయి. వాటితోపాటు కొత్తలో చిన్నాపెద్ద గ్రహాలు, ఆస్టరాయిడ్లు ఢీకొట్టుకోవడంతో ఏర్పడిన శకలాలూ ఉన్నాయి. అవన్నీ సూర్యుడి చుట్టూ వివిధ కక్ష్యల్లో పరిభ్రమిస్తున్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని ఆస్టరాయిడ్లు.. గ్రహాల కక్ష్యలను దాటుకుంటూ ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి గ్రహాలను ఢీకొడుతుంటాయి. అలా సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఓ ఆస్టరాయిడ్‌ భూమిని ఢీకొట్టడంతోనే.. డైనోసార్లు సహా చాలా రకాల జీవులు అంతరించిపోయాయి.

భూమికి రక్షణగా.. 
సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చిన ఆస్టరాయిడ్లు గురుగ్రహం ఆకర్షణకు లోనై.. దాని కక్ష్యలో చేరిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కడో బయటి నుంచి వచ్చి చిక్కుకుపోయిన వీటిని ట్రోజాన్‌ ఆస్టరాయిడ్లుగా పిలుస్తున్నారు. ఇవి గురుగ్రహ కక్ష్యలోనే ఆ గ్రహానికి ముందు ఒక గుంపుగా, వెనుక మరో గుంపుగా తిరుగుతున్నాయి. ఇవి నేరుగా దూసుకొచ్చి ఉంటే.. వాటిలో కొన్ని అయినా భూమిని ఢీకొట్టి ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా జరగకుండా గురుగ్రహం భూమికి రక్షణ కల్పిస్తోందని అంటున్నారు. 

1994 జూలైలో నాసాకు చెందిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన గురుగ్రహం చిత్రమిది. షూమేకర్‌–లెవీ9 తోకచుక్కకు చెందిన పెద్ద పెద్ద శకలాలు గురుగ్రహం ఆకర్షణకులోనై దానిపై పడిపోవడాన్ని (ముదురు గోధుమ రంగులో ఉన్న ప్రాంతం) హబుల్‌ చిత్రీకరించింది. ఆ తర్వాత కూడా చాలా ఆస్టరాయిడ్లు గురుగ్రహాన్ని ఢీకొట్టాయి. 
 తాజాగా గత నెల 13న ఓ ఆస్టరాయిడ్‌ గురుగ్రహాన్ని ఢీకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఓ పెద్ద ఆస్టరాయిడ్‌ గురుగ్రహం ఆకర్షణకు లోనై ముక్కలై, ఆ గ్రహంపై పడిపోయి ఉంటుందని జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ కమ్యూనికేషన్‌ సైన్స్‌ ల్యాబ్‌ పరిశోధకుడు మార్క్‌ డెల్‌క్రోక్స్‌ వెల్లడించారు.(గత నెలలో గురుగ్రహాన్ని ఆస్టరాయిడ్‌ ఢీకొన్నప్పుడు వెలువడిన కాంతి ఇది)


శనిగ్రహంతోనూ రక్షణ 
సౌర కుటుంబంలో రెండో పెద్ద గ్రహమైన శనిగ్రహం కూడా ఆస్టరాయిడ్లను ఆకర్షించి, భూమికి రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుడి తరహాలోనే శనిగ్రహానికి ముందు, వెనుక కూడా కొన్ని ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయని చెప్తున్నారు.

నాసా ‘ల్యూసీ’ మిషన్‌ ఎందుకు? 
సౌర కుటుంబం అంచుల్లో యురేనస్‌ గ్రహానికి అవతల కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని క్యూపియర్‌ బెల్ట్‌ అంటారు. సూర్యుడు, గ్రహాలు రూపొందిన కొత్తలోనే ఆ ఆస్టరాయిడ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. వాటిపై సూర్యుడి ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో.. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్ల నాటి ఆధారాలు అలాగే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి.

దీనితోపాటు భూమిపై జీవం ఆవిర్భావానికి ఆస్టరాయిడ్ల నుంచి వచ్చిన పదార్థాలే కారణం కావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. అటు సౌర కుటుంబం గుట్టును, ఇటు జీవం ఆవిర్భావానికి మూలాలను తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ‘ల్యూసీ’ మిషన్‌ను చేపట్టింది.
గురుడి ముందు, వెనకాల కలిపి ఇప్పటివరకు 6,500కుపైగా ట్రోజాన్‌ ఆస్టరాయిడ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ముందు పరిభ్రమిస్తున్న నాలుగింటిని, వెనకాల పరిభ్రమిస్తున్న మూడింటిని నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. 
ల్యూసీ వ్యోమనౌక భూమి నుంచి ప్రయాణం ప్రారంభించి సూర్యుడిని చుట్టేసి.. తిరిగి భూమికి దగ్గరగా వస్తుంది. తర్వాత భూమి గ్రావిటీతో వేగం పెంచుకుని.. 2027లో గురు డి ముందున్న ఆస్టరాయిడ్‌ గ్రూప్‌కు చేరుకుంటుంది. అక్కడ 4 ఆస్టరాయిడ్లపై పరిశోధన చేశాక 2028లో భూమివైపు ప్రయాణిస్తుంది. 
రెండోసారి భూమి గ్రావిటీ నుంచి బలం పుంజుకుని.. 2032లో గురుగ్రహం వెనుక ఉన్న ఆస్టరాయిడ్‌ గ్రూప్‌కు చేరుకుని ఏడాదిపాటు పరిశోధన చేస్తుంది. ఒకవైపు ఆరేళ్లు, మరోవైపు ఆరేళ్లు.. కలిపి 12 ఏళ్లపాటు ప్రయాణం, పరిశోధన జరుగనున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top